Seethakka Angry On KTR: తనపై దుష్ప్రచారం వెనక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారంటూ మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. గిరిజన బిడ్డను కాబట్టే తనపై లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లికే రక్షణ ఇవ్వలేని కేటీఆర్‌కు ఆదివాసీ బిడ్డ అయిన తనతో ఎందుకుని వార్నింగ్ ఇచ్చారు. తనతో పెట్టుకుంటే నాశనం అయిపోతావ్ అని ఘాటు విమర్శలు చేశారు. ములుగు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తట్టుకోలేక బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ప్రొద్భలంతోనే ములుగు నియెజకవర్గంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అట్టడుగు వర్గాల బిడ్డల నాయకత్వాన్ని దొరలు సహించలేకపోతున్నారని విమర్శించారు.
తనను బీఆర్ఎస్‌లో చేరమని అడిగితే.. ఒప్పుకోలేదనే కక్షతోనే కేసీఆర్, కేటీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని సీతక్క పేర్కొన్నారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేయని అభివృద్ధి పనులను తాము చేసి చూపిస్తున్నామని తెలిపారు. అందుకే భయపడి తమ ఉనికి కోసం ములుగులో కేటీఆర్ డ్రామాలు ఆడిస్తున్నారని దుయ్యబట్టారు. తాను ఎవరి జోలికి వెళ్లనని.. తన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని.. అయినా కానీ ప్రజలు తనకు అండగా నిలబడి భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు.
Also Read: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్
అప్పటి నుంచి తనపై కక్ష కట్టి దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. తనను బ్యాడ్ చేసేలా కావాలనే బీఆర్ఎస్ కార్యకర్తలను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తూ కుట్ర రాజకీయాలకు తెరలేపారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ములుగు జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమ అరెస్టులు ఎన్ని..? తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ అరెస్టులు ఎన్నో ఆధారాలతో సహా చర్చకు సిద్ధమా? అని కేటీఆర్‌కు సీతక్క సవాల్ విసిరారు.


