కంచ గచ్చిబౌలి భూముల(HCU Lands)పై చర్చ జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. వర్సిటీ భూములను ప్రభుత్వం గుంజుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. విద్యార్ధులు రాజకీయల ప్రలోభానికి గురికావొద్దని సూచించారు. 2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాలను HCUకి మరో చోట కేటాయించిందన్నారు. ఈ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నామని వివరింఆరు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి, ఒక అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘‘వారం రోజుల క్రితం హెచ్‌సీయూ వీసీ, రిజిస్ట్రార్‌తో ప్రభుత్వ పరంగా మేం సంప్రదింపులు చేశాం. వారికి స్పష్టంగా చెప్పాం. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించాలని భావించాం. వర్సిటీ భూమి వర్సిటీకే ఉండాలని వారికి తెలియజేశాం. 2016లో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే.. 1500 పైచిలుకు ఎకరాల భూమి వారికి న్యాయపరంగా ఇచ్చేందుకు సిఫార్సులు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో చర్చించాలని సూచించాం. చట్టపరమైన అన్ని హక్కులు కల్పిస్తామని వారికి స్పష్టంగా చెప్పాం’’
‘‘గత రెండు రోజుల నుంచి కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు అక్కడ ఉన్న రాక్ ఫార్మేషన్స్, లేక్‌లు, ప్రసిద్ధి గాంచిన మష్రూమ్ రాక్స్, పికాక్ లేక్‌ను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. హెచ్‌సీయూ పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడతాం. అవన్నీ ప్రభుత్వ భూముల్లో ఉన్నప్పటికీ వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నాం. హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దు. పార్టీల ప్రలోభానికి లోనుకావొద్దు’’ అని వెల్లడించారు.