MLC Kavitha| ఉద్యమ సమయంలో ఉన్న తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహాలను ప్రతి గ్రామంలో ప్రతిష్టిస్తామని బీర్ఆఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ అస్తిత్వంపై దాడి- చర్య’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేశారు.
అనంతరం కవిత మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూపం మార్చారని ఆరోపించారు.
తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందని.. కానీ అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే సమాజంలో స్నేహశీలత, సుహృద్భావం ఎలా కనిపిస్తుంది..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి ఎక్కడా లేరని మండిపడ్డారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవ్వరికీ లేదని ఆమె ఫైర్ అయ్యారు.