బీఆర్ఎస్ పార్టీలో కొంత మంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. సమయం వస్తే అన్నీ బయటకు వస్తాయని తెలిపారు. తాను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నానని పేర్కొన్నారు. పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. తాను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని హెచ్చరించారు. తనపై దుష్ప్రచారం విషయంలో పార్టీ అధిష్టానం స్పందిస్తుందని భావిస్తున్నానని కవిత వెల్లడించారు.
ఇక తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మాట్లాడారని విమర్శించారు. టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ (KCR) అందుబాటులో ఉంచారని చెప్పారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “టీజీఐఐసీ పరిధిలో లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టే కుట్రపూరిత సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారు. నా దగ్గర నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయి. టీజీఐఐసీని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసింది. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్‌లో కుదువపెట్టే కుట్ర జరుగుతోంది. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన లేకపోవడం దారుణం. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి” అని ఆమె డిమాండ్ చేశారు.