బుధవారం (డిసెంబర్ 21) తెలంగాణలోని ఖమ్మంలో టీడీపీ నిర్వహించిన శంఖారావం సభలో.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, హైదరాబాద్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నాంది పలికిందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. గురువారం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత.. టీడీపీ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ కాదన్నారు. చుక్కలెన్ని ఉన్నా చందమామ ఒక్కటేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నిర్వహించిన సభను ఉదాహరణ చూపిస్తూ.. తెలంగాణలో టీడీపీ మళ్లీ యాక్టివ్ కాబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఇక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని హితవు పలికారు. తెలంగాణకు చంద్రబాబు మళ్లీ వచ్చి పార్టీని పునర్నిర్మించాలని పిలుపునివ్వడాన్ని నమ్మొద్దన్నారు. ఇప్పుడు బీజేపీతో పాటు టీడీపీని కూడా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిని ఎండగడుతూనే.. టీడీపీ సభపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు జనాలు వచ్చినంత మాత్రాన.. పార్టీ మళ్లీ పునర్నిర్మితమవుతుందనడం మంచిది కాదన్నారు.