బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోము అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అధికార పార్టీని హెచ్చరించారు. సోమవారం ఆమె బంజారాహిల్స్ లోని తన నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో నిధులు పారితే… కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం నుంచి, మంత్రుల వరకు తిట్లు వరదలా పారుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి.. కేసీఆర్ ఒక వేగుచుక్క అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని కొనియాడారు.