Weather Forecast Update: బంగాళాఖాతం తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఒడిశా నుంచి తూర్పు తెలంగాణ వరకు అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతోందని అన్నారు. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లుగా అంచనా వేశారు. ఇది కాకుండా మరో ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడి కర్ణాటక వరకు కొనసాగుతోందని అన్నారు. ఈ ద్రోణి తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా వ్యాపించి ఉందని తెలిపారు. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రెండు ద్రోణుల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్: నేడు రాష్ట్రంలోని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ రహదారులు జలమయం: గత పది రోజులుగా హైదరాబాద్ ప్రజలు నరకం చూస్తున్నారు. ఒక్కసారిగా ఉన్నట్లుండీ.. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండతో ఉక్కపోత ఉండగా.. సాయంత్రం వేళలో భారీ వర్షం కురుస్తుంది. మంగళవారం సాయంత్రం కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో నగర రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు తెగ ఇబ్బందికి గురైయ్యారు. కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, నారాయణగూడ, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ , ఖైరతాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, అత్తాపూర్, శివరాంపల్లి, గండిపేట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తెగ ఇబ్బందికి గురవుతున్నారు. హైదరాబాద్‌లో పది నిమిషాల సేపు వర్షం పడినా మెయిన్ రోడ్లు మొదలుకుని బస్తీ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో నగర వాసులు నరకం చూస్తున్నారు. అయితే ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


