Minor drug abuse party : సోషల్ మీడియా పరిచయం.. ఫామ్‌హౌస్‌లో ఏకాంతం.. డీజే మోతలో అంతులేని ఆనందం.. ఇదీ సైబరాబాద్ శివార్లలోని ఓ పార్టీకి నిర్వాహకులు ఇచ్చిన ఆకర్షణీయమైన ప్రకటన. దీనికి ఆకర్షితులైన 50 మంది మైనర్లు తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి అక్కడ వాలిపోయారు. తీరా మత్తులో జోగుతున్న సమయంలో పోలీసుల మెరుపుదాడితో వారి ఆనందం ఆవిరైపోయింది. అసలు ఈ ‘ట్రాప్ హౌస్ పార్టీ’ అంటే ఏమిటి? కేవలం ఇన్‌స్టాగ్రాం పరిచయంతో ఇంతమంది మైనర్లు ఒకేచోట ఎలా చేరారు..? పోలీసుల దాడిలో బయటపడిన విస్తుపోయే నిజాలేంటి…?
నగరంలో మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో యువతను, ముఖ్యంగా మైనర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో మైనర్లతో ఏర్పాటు చేసిన ‘ట్రాప్ హౌస్ పార్టీ’ని రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమైన వారంతా కలిసి ఈ పార్టీని నిర్వహించుకుంటుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
నగరానికి చెందిన ఓ డీజే, ఇన్‌స్టాగ్రాంలో ‘ట్రాప్ హౌస్.9 ఎంఎం’ పేరుతో ఒక ఖాతా నిర్వహిస్తున్నాడు. మొయినాబాద్‌లోని ఓక్స్ ఫామ్‌హౌస్‌లో ఒక ప్రత్యేకమైన పార్టీ నిర్వహిస్తున్నట్లు, ఇది మామూలు పార్టీ కాదని, ఇక్కడికొస్తే “అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చని” ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చాడు.
పాస్‌లతో పక్కా ప్లాన్: శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ పార్టీలో పాల్గొనాలంటే ముందుగానే పాస్‌లు తీసుకోవాలని షరతు పెట్టాడు. ఒక్కరికైతే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800గా ధర నిర్ణయించాడు.
ఇంట్లో అబద్ధం చెప్పి.. ఈ ఇన్‌స్టా ప్రకటన చూసిన నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది మైనర్లు ఆకర్షితులయ్యారు. ఇంట్లో పర్యాటక ప్రాంతానికి వెళ్తున్నామని అబద్ధాలు చెప్పి, శనివారం మధ్యాహ్నం ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.
పోలీసుల సడెన్ ఎంట్రీతో షాక్: ఈ పార్టీపై విశ్వసనీయ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు, సాయంత్రం వేళ ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడి చేశారు. అప్పటికే మైనర్లంతా మద్యం, మత్తులో జోగుతున్నారు. పోలీసులను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
గంజాయి సేవించిన ఇద్దరు: పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.
ఆరుగురు నిర్వాహకుల అరెస్ట్: పోలీసులు ఆరుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఫామ్‌హౌస్ యజమాని, ప్రధాన నిర్వాహకుడైన డీజే, ఇతర ఆపరేటర్లు ఉన్నారు.
విదేశీ మద్యం స్వాధీనం: పార్టీ స్థలం నుంచి 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసును మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. మైనర్లకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. సామాజిక మాధ్యమాల్లోని ఆకర్షణలకు లోబడి పిల్లలు తప్పుదోవ పడుతున్నారని, తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.


