Montha Cyclone : మొంథా తుపాను వెళ్లిపోయింది, కానీ అది మిగిల్చిన గాయం పచ్చిగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చి, అనేక కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఉద్ధృతంగా ప్రవహించిన వరద నీరు, కూలిన గోడలు, విద్యుత్ ఘాతాలు.. ఇలా పలు రూపాల్లో మృత్యువు కరాళ నృత్యం చేసింది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎనిమిది మంది మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అసలు ఎక్కడెక్కడ, ఎలా ఈ ఘోరాలు జరిగాయి? అధికారుల నిర్లక్ష్యం ఎక్కడైనా ప్రాణాలు తీసిందా?
జలసమాధి అయిన బతుకులు : మొంథా బీభత్సానికి రాష్ట్రం వణికిపోయింది. వాగులు, వంకలు ఏకమై ఊళ్లను ముంచెత్తాయి. ఈ జల ప్రళయంలో కొందరు విధి వంచితులుగా ప్రాణాలు కోల్పోయారు.
ఉమ్మడి వరంగల్‌లో విషాద ఛాయలు: తుపాను మరణాల్లో అత్యధికం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే నమోదయ్యాయి.
వాగు దాటుతూ: మహబూబాబాద్ జిల్లాలో పులిగుజ్జు సంపత్ (30) అనే యువకుడు బైక్‌పై వాగు దాటుతూ ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు.
గోడకూలి: గూడూరులో కోల రామక్క (80) అనే వృద్ధురాలు నిద్రిస్తుండగా ఇంటి గోడ కూలి మీద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అదేవిధంగా, ఐనవోలు మండలం కొండపర్తిలో గద్దల సూరమ్మ (72) కూడా గోడ కూలే మరణించారు.
వరదలో చిక్కి: వరంగల్‌లోని శివనగర్‌లో పులి అనిల్ (30) వాగులో పడి మృతి చెందగా, ఎస్సార్‌నగర్‌లో అడప కృష్ణమూర్తి (70) ఇంట్లోకి వరద నీరు చేరడంతో బయటకు రాలేక చనిపోయారు. హనుమకొండ వాజ్‌పేయీ కాలనీలో విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ (63) వరద నీటిలో కొట్టుకుపోయారు.
గల్లంతు: భీమదేవరపల్లిలో ఇసంపెల్లి ప్రణయ్ (30), కల్పన (25) దంపతులు కల్వర్టు దాటుతూ గల్లంతయ్యారు. జఫర్‌గఢ్‌లో బీటెక్ విద్యార్థిని శ్రావ్య (18) మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోగా, ఆమె ఆచూకీ ఇంకా లభించలేదు.
విధి నిర్వహణలో విషాదం: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అసిస్టెంట్ లైన్‌మెన్ సురేశ్ (34) విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయారు.
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారి బలి : మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో అధికారుల నిర్లక్ష్యం ఓ పసి ప్రాణాన్ని బలిగొంది. ఇంటి ముందు విద్యుత్ స్తంభం కోసం తీసిన గుంతను పూడ్చకపోవడంతో, అందులో వర్షపు నీరు నిలిచింది. ఆడుకుంటూ వెళ్లిన మూడేళ్ల బాలుడు రిత్విక్ ఆ గుంతలో పడి మృతి చెందాడు. కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జీవాలూ బలి.. జీవనాధారం ఆవిరి : ఈ ప్రళయం మనుషులతో పాటు మూగజీవాలను కూడా బలి తీసుకుంది, రైతుల జీవనాధారాన్ని దెబ్బతీసింది. జనగామ జిల్లాలో కర్క ప్రశాంత్ రెడ్డికి చెందిన కోళ్లఫారంలోకి నీరు చేరి 10,280 కోడి పిల్లలు (విలువ రూ.8 లక్షలు) మృతి చెందాయి. వెల్దండ గ్రామంలో పంతంగి చంద్రమౌళికి చెందిన 98 గొర్రెలు చెరువు మత్తడిలో కొట్టుకుపోయాయి.
కరీంనగర్ మానేరు నదిలో వరద పోటెత్తడంతో, చిత్తూరు జిల్లాకు చెందిన వలస జీవులైన ధనలక్ష్మి, డేవిడ్ దంపతులకు చెందిన 16 వేల బాతు పిల్లలు (విలువ రూ.20 లక్షలు) మృత్యువాతపడ్డాయి.
వరంగల్ శివనగర్‌లో వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను స్థానిక యువకులు పొక్లెయిన్ సాయంతో సురక్షితంగా కాపాడటం ఒక్కటే ఈ విషాదంలో ఊరటనిచ్చే అంశం. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి ఆచూకీ లభించాలని కుటుంబ సభ్యులు కన్నీటితో ఎదురుచూస్తున్నారు.


