Monday, November 17, 2025
HomeతెలంగాణUrea supply : యూరియాకు 'వెబ్' కళ్లెం.. రాష్ట్రంలోనే తొలిసారిగా నాగర్‌కర్నూల్‌లో పైలట్ ప్రాజెక్ట్!

Urea supply : యూరియాకు ‘వెబ్’ కళ్లెం.. రాష్ట్రంలోనే తొలిసారిగా నాగర్‌కర్నూల్‌లో పైలట్ ప్రాజెక్ట్!

Website-based urea supply : యూరియా కోసం రైతుల పాట్లు.. అక్రమ నిల్వలతో డీలర్ల మాయాజాలం.. ఈ తంతుకు చెక్ పెట్టేందుకు, తెలంగాణ వ్యవసాయ శాఖ ఓ విప్లవాత్మక అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో వెబ్‌సైట్ ఆధారిత యూరియా పంపిణీ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇకపై ప్రతి బస్తాకు లెక్క పక్కాగా ఉండనుంది. అసలు ఏమిటీ కొత్త విధానం..? ఇది రైతులకు, వ్యవస్థకు ఎలా మేలు చేయనుంది..?

- Advertisement -

ఎందుకీ కొత్త విధానం : యూరియా సరఫరాలో పారదర్శకత తీసుకురావడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం, కొందరు వ్యాపారులు అవసరం లేకున్నా యూరియాను నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కొందరు రైతులు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ బస్తాలను తీసుకుని, పక్కదారి పట్టిస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు, నాగర్‌కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖ ఈ ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది.

‘వెబ్’ విధానం పనిచేసేదిలా : ‘యూరియా డిస్ట్రిబ్యూషన్ ఇన్ నాగర్‌కర్నూల్’ పేరుతో ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించారు. అక్టోబర్ 1 నుంచి దీని ద్వారానే యూరియా పంపిణీ జరగనుంది.

రైతుల డేటాబేస్: జిల్లాలోని 3.13 లక్షల మంది రైతుల పూర్తి సమాచారాన్ని (పేరు, పట్టాదారు పాసుపుస్తకం, ఫోన్ నంబర్, భూమి విస్తీర్ణం) ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.
పంటల వారీగా కోటా: ఏఈవోలు, ఏ రైతు ఏ పంట వేశారనే వివరాలను నమోదు చేస్తారు. దాని ఆధారంగా, ఒక్కో పంటకు ప్రభుత్వం నిర్దేశించిన కోటా (వరికి ఎకరానికి 2 బస్తాలు, మొక్కజొన్నకు 4 బస్తాలు) ప్రకారం, ఆ రైతు ఎన్ని యూరియా బస్తాలకు అర్హుడో వెబ్‌సైట్ నిర్ణయిస్తుంది.

డీలర్లకు లాగిన్: జిల్లాలోని సుమారు 200 మంది ఎరువుల డీలర్లకు, అధికారులకు ప్రత్యేక లాగిన్లు ఇస్తారు.

పారదర్శక పంపిణీ: రైతు యూరియా కోసం వచ్చినప్పుడు, డీలర్ అతని వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయగానే, అతనికి అర్హత ఉన్న బస్తాల సంఖ్య కనిపిస్తుంది. రైతు ఎన్ని బస్తాలు తీసుకున్నాడనే వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదవుతాయి.

ప్రయోజనాలేంటి : ఈ కొత్త విధానం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఒక రైతు జిల్లాలో ఎక్కడ యూరియా తీసుకున్నా, ఎన్ని బస్తాలు తీసుకున్నాడో ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది. దీనివల్ల ఇష్టానుసారంగా ఎక్కువ బస్తాలు తీసుకునే అవకాశం ఉండదు. యూరియా బస్తాలు పక్కదారి పట్టడం, నల్ల బజారుకు తరలిపోవడం వంటి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది.అవసరాన్ని బట్టి, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను నియంత్రించడం అధికారులకు సులభమవుతుంది.

“వెబ్‌సైట్ సిద్ధం చేశాం. జిల్లా కలెక్టర్ అనుమతితో అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తాం. దీనివల్ల ప్రతి బస్తాకు లెక్క ఉంటుంది, పక్కదారి పట్టే అవకాశం ఉండదు,” అని జిల్లా వ్యవసాయాధికారి యశ్వంత్‌రావు తెలిపారు. ఈ నెల చివరి వారంలో డీలర్లందరికీ ఈ వెబ్‌సైట్ నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad