రంగారెడ్డి జిల్లా ఎల్.బి. నగర్ నియోజకవర్గం పరిధిలోని నందనవనంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్న వారిని తక్షణం ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాలని రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్, నందనవనంలో ఉన్న ఇండ్ల సమస్య, కేటాయింపుపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ డి. దివ్య, ప్రస్తుత రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన డాక్టర్ ఎస్. హరీష్, కె. శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్రమంగా ప్రభుత్వ ఇండ్లను ఆక్రమించుకున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి రాజకీయ వత్తిడులకు తలొంగ వద్దని అధికారులకు సూచించారు.నందనవనంలో జె ఎన్ యూ ఆర్ ఎం పధకం కింద ప్రభుత్వం నిర్మించిన ఇండ్ల కోసం 2019లో దరఖాస్తు చేసుకొని, లబ్దిదారుని వాటా చెల్లించిన వారి ఇండ్లను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకోవడం పట్ల మంత్రి తీవ్రంగా స్పందించారు. బాధితులకు న్యాయం చేయాలని, అక్రమంగా ఆక్రమించుకున్న వారినుంచి ఇండ్లు స్వాధీనం చేసుకొని వారికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
వీలైనంత త్వరగా..
మంకాల్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో ఉన్న న్యాయపరమైన సమస్యలను తక్షణం పరిష్కరించి, అర్హులైన వారికి కేటాయించాలని అధికారులకు సూచించారు. ఈ రెండు అంశాలపై పూర్తిస్ధాయి నివేదికను తనకు అందించాలని, వీలైనంత త్వరితగతిన ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిరుపేదలకు అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. ప్రజావాణిలో గృహనిర్మాణానికి సంబంధించి వచ్చే ఫిర్యాదులను సచివాలయంలోని తన కార్యాలయానికి పంపించాలని నోడల్ అధికారికి దివ్యకు సూచించారు. వాటి పరిష్కారానికి తన కార్యాలయంలో ఒక ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు.