Neem tree dieback disease in Telangana : మన ఇంటి పెరట్లో ఓ ఔషధ గని.. మన ఊరి పొలిమేరలో ఓ పచ్చని గొడుగు.. తరతరాలుగా మన ఆరోగ్యానికి, మన పర్యావరణానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్న ‘సర్వరోగ నివారిణి’ వేప చెట్టుకు మళ్లీ ఆపదొచ్చింది. నాలుగేళ్ల క్రితం కంటిమీద కునుకు లేకుండా చేసిన సమస్యే మళ్లీ కోరలు చాస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లాల్లో వేలాది వేప చెట్లు కొమ్మలెండిపోయి మోడులా దర్శనమిస్తున్నాయి.
పల్లెల్లో ఆందోళన.. పచ్చదనానికి గండం : శీతాకాలం ప్రారంభంలో పచ్చని చిగుళ్లతో కళకళలాడాల్సిన వేప చెట్లు, నేడు ఎండిన కొమ్మలతో విషాద వదనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లాల్లోని అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. చెట్ల చిగురాకులు మొదట ఎండిపోయి, క్రమంగా ఆకులు, కొమ్మలకు వ్యాపిస్తూ చెట్టంతా నిర్జీవంగా మారుతోంది. నాలుగేళ్ల క్రితం ఇదే సమస్యతో వేలాది చెట్లను కోల్పోయిన రైతులు, గ్రామస్థులు ఇప్పుడు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు.
కారణం ‘కొమ్మ ఎండు తెగులు’ : ఇది అరిష్టం కాదని, ఒక రకమైన ఫంగస్ (శిలీంధ్రం) వల్ల సంక్రమించే “కొమ్మ ఎండు తెగులు” అని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అధిక వర్షాలు, వాతావరణంలో ఉష్ణోగ్రతల మార్పుల కారణంగా ఈ తెగులు వేగంగా వ్యాపిస్తుందని వారు వివరిస్తున్నారు. ఫామోస్ఫిస్ అజాడిరక్టే, ఫ్యూసారియమ్ అనే రెండు రకాల శిలీంధ్రాలు ఈ వినాశనానికి కారణమని గుర్తించారు. గతంలో తెగులు సోకిన చెట్ల భాగాలపై పేరుకుపోయిన ఈ శిలీంధ్రాల బీజాలు, అనుకూల వాతావరణంలో మళ్లీ విజృంభించి చెట్లను నాశనం చేస్తున్నాయని అంచనా వేస్తున్నారు.
నివారణ ఇదే.. శాస్త్రవేత్తల సూచన : ఈ తెగులును అరికట్టవచ్చని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాలెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త శంకర్ భరోసా ఇస్తున్నారు. ఆయన సూచించిన నివారణ చర్యలు ఇవి:
పిచికారీ: లీటరు నీటిలో ఒక గ్రాము ‘కార్బండిజమ్’ లేదా లీటరు నీటిలో 2 గ్రాముల ‘కార్బండిజమ్ + మాంకోజెమ్’ మిశ్రమాన్ని కలిపి చెట్టు కొమ్మలు, ఆకులు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.
వేర్లకు మందు: చెట్టు మొదట్లో పెద్ద పాదులు చేసి, 50 లీటర్ల నీటిలో 50 గ్రాముల కార్బండిజమ్ కలిపి ఆ ద్రావణం వేర్ల వరకు ఇంకేలా పోయాలి.
ప్రత్యేక చికిత్స: తెగులు సోకిన చెట్ల కాండం, కొమ్మలపై రంధ్రాలు కనిపిస్తే, లీటరు నీటిలో 0.2 గ్రాముల ‘థయామిధాక్సమ్’ లేదా ‘ఎసిటమాప్రిడ్’ మందును కలిపి ఆ రంధ్రాలలో పోయాలి.
సాధారణ పద్ధతులు: నీటిని వేగంగా చెట్లపై చల్లడం ద్వారా శిలీంధ్రాలను రాలగొట్టవచ్చు. అలాగే, చెట్ల వేర్లకు క్రమం తప్పకుండా తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం.
ప్రకృతి ప్రసాదించిన ఈ అపురూప సంపదను కాపాడుకోవడానికి రైతులు, ప్రజలు వెంటనే స్పందించి, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే ఈ గండం నుంచి గట్టెక్కవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


