How to secure your new smartphone : పండగల వేళ వేలు ఖర్చుపెట్టి కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్న ఆనందంలో ఉన్నారా? ఆ ఫోన్ ఇప్పుడు మీ ప్రపంచంలో భాగమైపోయింది కదూ! కానీ, అంత ఖరీదైన మీ ఫోన్ అనుకోకుండా చోరీకి గురైతే? లేదా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి మీ వ్యక్తిగత సమాచారం అపహరణకు గురైతే? ఆ ఆలోచనే గుండెల్లో దడ పుట్టిస్తుంది. అందుకే, ఫోన్‌ను కేవలం వాడటమే కాదు, దానికి పటిష్టమైన భద్రత కల్పించడం కూడా అంతే ముఖ్యం. మీ స్మార్ట్‌ఫోన్‌ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి, ఒకవేళ పోయినా తిరిగి దక్కించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని స్మార్ట్ చిట్కాలపై ప్రత్యేక కథనం.
ఆ నంబరే మీ ఫోన్‌కు రక్షణ కవచం : ప్రతి ఫోన్‌కు ఒక ప్రత్యేకమైన 15 అంకెల IMEI (International Mobile Equipment Identity) నంబరు ఉంటుంది. ఇదే మీ ఫోన్‌కు అసలైన గుర్తింపు. ఫోన్ పోయినప్పుడు ఈ నంబరు అత్యంత కీలకం. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన CEIR (Central Equipment Identity Register) వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ఈ నంబరు తప్పనిసరి. అందుకే, కొత్త ఫోన్ కొన్న వెంటనే *#06# డయల్ చేసి మీ IMEI నంబర్లను నోట్ చేసుకోవాలి. ఫోన్ డబ్బా, కొనుగోలు రశీదుపై కూడా ఈ నంబర్లు ఉంటాయి కాబట్టి, వాటిని భద్రంగా దాచుకోవడం శ్రేయస్కరం.
డబ్బా, బిల్లు పడేయకండి.. ఎంతో విలువైనవి : ఫోన్ కొన్నాక డబ్బా, బిల్లు పాత సామాన్ల కింద పడేస్తున్నారా? ఆ పొరపాటు అస్సలు చేయవద్దు. భవిష్యత్తులో ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అమ్మాలన్నా, రీసేల్ చేయాలన్నా ఒరిజినల్ డబ్బా ఉంటే 10 నుంచి 20 శాతం వరకు అదనపు ధర పొందే అవకాశం ఉంది. అలాగే, ఫోన్‌లో ఏవైనా సమస్యలు వస్తే వారంటీ క్లెయిమ్ చేయడానికి కొనుగోలు బిల్లు తప్పనిసరి. ఖరీదైన ఫోన్ అయితే బీమా చేయించడం ఇంకా ఉత్తమం.
ప్రతి యాప్‌కు తాళం.. గోప్యతకు భరోసా : సైబర్ మోసాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో, మన ఫోనే మన బలహీనతగా మారకూడదు. ఫోన్‌లోని వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ వివరాలు, ఫోటోలు, వీడియోల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం ఫోన్‌లోని ప్రతి యాప్‌కు తప్పనిసరిగా లాక్ వేసుకోవాలి. సాధారణ పిన్, ప్యాటర్న్‌లకు బదులుగా బయోమెట్రిక్ (వేలిముద్ర), ఫేస్‌లాక్ వంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకు పెద్దపీట వేయాలి. దీనివల్ల మీ ఫోన్ ఇతరుల చేతికి చిక్కినా మీ సమాచారం సురక్షితంగా ఉంటుంది.
ఫోన్ పోయిందా? కంగారు వద్దు.. ఇలా చేయండి : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫోన్ పోయిందా? కంగారు పడకుండా ఈ క్రింది విధంగా చేయండి.
తొలి అడుగు: వెంటనే మీ సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి ఫోన్ పోయినట్లు ఫిర్యాదు చేసి, రశీదు తీసుకోండి.
సిమ్ బ్లాక్: ఆ ఫిర్యాదు రశీదుతో మీ నెట్‌వర్క్ స్టోర్‌కు వెళ్లి, అదే నంబర్‌పై కొత్త సిమ్ కార్డు తీసుకోండి. దీనివల్ల పాత సిమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతుంది.
CEIR పోర్టల్‌లో ఫిర్యాదు: ఇప్పుడు CEIR అధికారిక వెబ్‌సైట్ (ceir.gov.in) ఓపెన్ చేసి, ‘Block Stolen/Lost Mobile’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
వివరాల నమోదు: అక్కడ మీ మొబైల్ నంబర్లు, IMEI నంబర్లు, ఫోన్ పోయిన ప్రదేశం వంటి వివరాలను నమోదు చేయాలి. మీసేవ ఫిర్యాదు ప్రతి, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ వంటివి), ఫోన్ కొనుగోలు రశీదును అప్‌లోడ్ చేయాలి.
ట్రాకింగ్ ఐడీ: దరఖాస్తు పూర్తి చేశాక, మీ కొత్త నంబర్‌కు ఒక రిక్వెస్ట్ ఐడీ వస్తుంది. దాని ద్వారా మీ ఫిర్యాదు స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మీరు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా CEIR అధికారులు ఆ ఫోన్‌ను బ్లాక్ చేస్తారు. దొంగలు అందులో ఏ కొత్త సిమ్ వేసినా, ఆ సమాచారం వెంటనే పోలీసులకు, CEIR పోర్టల్‌కు తెలిసిపోతుంది. దీని ద్వారా మీ ఫోన్ దొరికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.


