లగచర్ల బాధితుల ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా తీసుకుంది. గత సోమవారం బీఆర్‌ఎస్ సాయంతో రైతులు ఢిల్లీలోని కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫార్మా విలేజ్ కోసం బలవంతంగా మా భూములు లాక్కోవాలని చూస్తున్నారని, తమపై దాడులకు పాల్పడుతున్నారని, తప్పుడు ఆరోపణలతో తమ వారిపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని లగచర్ల గ్రామస్థులు కమిషన్ కి ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదుని సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)… ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు పంపింది. ఈ మేరకు గురువారం NHRC ఓ ప్రకటన విడుదల చేసింది.
NHRC విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం… “సరైన విధానాలను అనుసరించకుండా ప్రతిపాదిత ఫార్మా విలేజ్ కోసం రాష్ట్ర భూసేకరణను గ్రామస్తులు నిరసించిన తర్వాత ఆరోపించిన చర్యలు సంభవించాయి. ఆరోపించిన అఘాయిత్యాలకు గురైన వారిలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందినవారని పేర్కొన్నారు. కమీషన్‌ను సందర్శించిన కనీసం 12 మంది బాధితులు తమను ఈ విషయంలో ఆకలి నుండి రక్షించడానికి జోక్యం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఫిర్యాదును సమర్పించారు” అని ప్రకటనలో పేర్కొంది.