ఉపాధ్యాయ జీవితం ఉన్నతమైనదని రేపటి సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మున్సిపల్ వార్డులలో పర్యటించి రూ. 15 కోట్ల వ్యయంతో 44 అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక జడ్పి సమావేశ మందిరంలో 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయుల చేతుల్లోనే రేపటి పౌరులు తయారవుతున్నారని, మానవ పరిణామ క్రమాన్ని పాట, కవితలో చెప్పే వారే నిజమైన మేధావులు అని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులకు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అంటే ఏమిటి ? విశ్వం ఆది ఎక్కడ ? అంతం ఎక్కడ ? ఎక్కడి దాక విస్తరిస్తుంది ? అన్నది ఊహకు అందనిదని అన్నారు. అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగమదెంత దూరం అని అంతరాలు లేని సమాజం కోసం దాశరధి ఆశావాహ దృక్పథంతో రాశారు. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో అని పసిపాపల అమాయకత్వం, వారి మంచి మనసు చూసే భవితవ్యాన్ని కవి ఊహించి రాశారని తెలిపారు.అటువంటి సమాజాన్ని తయారు చేసే అద్భుతమైన అవకాశం ఉపాధ్యాయుల చేతులలో ఉంటుందన్నారు. అంతకుముందు వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.15 కోట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ది నిధులతో పెండింగ్ పనులకు శ్రీకారం చుట్టి ప్రారంభోత్సవం చేశారు. 44 సీసీ రహదారులు, డ్రైనేజీ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు మంత్రి వెంట పాల్గొన్నారు.