నిర్మల్ నియోజకవర్గంలో విస్తృతంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. రైతుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి. పొరుగు రాష్ట్రాలు సైతం తెలంగాణ పథకాలు, మన పాలన వైపు చూస్తున్నాయన్నారు ఐకే రెడ్డి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు రెండవ సారి ఎమ్మెల్యేగా గెలవరని ప్రతిపక్షాలు విమర్శించాయని, అయినా సీయం కేసీఆర్ సహకారంతో, దేవుని ఆశిస్సులతో, ప్రజల దీవెనతో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి రెండవ సారి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, జిల్లాలో అనేక ఆలయాలను అభివృద్దికి కృషి చేస్తున్నానని వివరించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, ప్రతిపక్షాల మాటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో జెండా పట్టుకొని తిరుగుతారని బీజేపీ నాయకులను ఉద్దేశించి మంత్రి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను తిప్పికొట్టాలని, ఎన్నికల సమయంలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపినిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జ్ గంగాధర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.