Nirmal| నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ(Ethanol factory) పనులకు బ్రేక్ పడింది. పరిశ్రమ వద్దంటూ కొన్ని రోజులుగా స్థానికులు తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చర్చలు జరిపారు. సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులకు తెలిపారు. అనంతరం పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ అనుమతులను కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
కాగా ఇటీవల ఫ్యాక్టరీ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తుండటంతో మంగళవారం గ్రామస్తులు రోడ్డెక్కారు. దాదాపు 12 గంటలకు పైగా ధర్నా చేపట్టారు. గ్రామస్తులకు నచ్చజెప్పడానికి వచ్చిన ఆర్డీవో కళ్యాణిని బంధించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని ఆర్డీవోను విడిపించి పలువురిని అరెస్ట్ చేశారు. అయితే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయడంతో పాటు అరెస్ట్ చేసిన గ్రామస్తులను విడుదల చేయాలని మళ్లీ ఆందోళనకు దిగారు. దీంతో జిల్లా కలెక్టర్ అభిలాష జోక్యం చేసుకుని వారితో చర్చలు జరిపారు.