ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యోగులకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగు బంధం ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ అనుబంధాన్నిఎన్నటికీ విడదీయలేరని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మైదానంలో మూడు రోజుల పాటు కొనసాగిన టీఎన్జీవో 34 వ జిల్లా స్థాయి అంతర్ శాఖల క్రీడా పోటీలు ముగిశాయి. వివిధ క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన జట్లను అభినందిస్తూ మెమొంటోలు అందజేశారు. తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం ప్రత్యేకంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం పట్ల టీఎన్జీవో జిల్లా కార్యవర్గానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు వేరు, తాము వేరు అనే భావన తమ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని, ఇకముందు కూడా అలాంటి ఆలోచన రాదని అన్నారు. ఉద్యోగులకు మంచి చేస్తే, దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని బలంగా విశ్వసించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగులు అడగకముందే వారికి జీతాలు, పదోన్నతులు, వైద్య సదుపాయాలు వంటి అనేక విషయాల్లో అనుకూల నిర్ణయాలు అమలు చేస్తున్నారని అన్నారు.