అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పచ్చి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. రైతుబంధు దుర్వినియోగం అయ్యిందని ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. అలాగే రైతు ఆత్మహత్యలపైనా అబద్ధాలు చెబుతోందన్నారు. రైతుబంధు మొదలయ్యాక రైతుల ఆత్మహత్యలు తగ్గాయని వివరించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయమని రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు.
మరోవైపు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ నాయకుల డొల్లతనం బయటపడింది అన్నారు. సీఎం 100 శాతం రుణమాఫీ అయింది అంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే 70 శాతం అయిందని చెబుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. మరోవైపు.. అసెంబ్లీలో కేసీఆర్ గురించి చాలా చిల్లర మాటలు మాట్లాడారని ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలు ఇవ్వని కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి అడగండని పిలుపునిచ్చారు. ఇక తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పుకొచ్చారు. ఈడీకి భయపడం.. మోడీకి భయపడమని స్పష్టంచేశారు. తమకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు.