Interstate train robber arrested : రాత్రి రైలు ప్రయాణం.. హాయిగా నిద్రపోతున్న ప్రయాణికులు.. ఇంతలో ఓ నీడలాంటి ఆకారం.. కళ్లు తెరిచేలోపే మెడపై కత్తి.. నోటి నుంచి తీసిన బ్లేడుతో దాడికి తెగబడే నరరూప రాక్షసుడు! ఇది ఏదో సినిమాలోని కాదు.. మూడు రాష్ట్రాల రైల్వే పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగ థానేదర్‌సింగ్ నేర చరిత్రలోని ఓ ఘట్టం. అసలు ఎవరు ఈ థానేదర్‌సింగ్? సిగరెట్లు అమ్ముకునే స్థాయి నుంచి మూడు రాష్ట్రాలను గడగడలాడించే అంతర్జాతీయ దొంగగా ఎలా మారాడు? విలాసవంతమైన జీవితం గడుపుతూ, పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిస్తూ.. తెరవెనుక అతను నడిపిన నేర సామ్రాజ్యం ఎలాంటిది? చివరికి పోలీసుల వలకు ఎలా చిక్కాడు?
రైళ్లలో ప్రయాణికులే లక్ష్యంగా, వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ వందలాది దోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగ థానేదర్ సింగ్ (36)ను ఎట్టకేలకు రైల్వే పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో సుమారు 400కు పైగా చోరీలు, దోపిడీలకు పాల్పడిన ఇతని అరెస్టుతో రైల్వే పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
నేర సామ్రాజ్యం.. తీరు ఇది: ఉత్తరప్రదేశ్‌కు చెందిన థానేదర్‌సింగ్, 2004లో పుణె రైల్వేస్టేషన్‌లో తినుబండారాలు అమ్ముతూ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.
భయానక శైలి: ఇతని పద్ధతే ప్రయాణికులను గజగజలాడిస్తుంది. ఎప్పుడూ తన జేబులో పదునైన కత్తి, నోటి బుగ్గ కింద సగం బ్లేడు ముక్కను దాచుకుంటాడు. ప్రయాణికులు నిద్రలో ఉన్నప్పుడు బ్యాగులు, జేబులు కత్తిరించి నగదు, నగలు కాజేస్తాడు.
దాడికి వెనుకాడడు: ఎవరైనా మేల్కొని అరిచినా, ఎదురు తిరిగినా ఏమాత్రం జంకడు. వెంటనే నోటిలోని బ్లేడుతో దాడి చేసి గాయపరిచి, ఉన్నదంతా దోచుకుని పారిపోతాడు. ఈ క్రూరమైన పంథాయే అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మార్చింది.
బంగారం తాకట్టు: దొంగిలించిన బంగారు ఆభరణాలను నేరుగా తన సొంత రాష్ట్రమైన యూపీకి తీసుకెళ్లి, అక్కడి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకునేవాడు.
విలాసవంతమైన జీవితం.. నేరాలమయం: దోపిడీల ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలతో థానేదర్‌సింగ్ విలాసవంతమైన జీవితం గడిపాడు.
హై-ఫై లైఫ్‌స్టైల్: 2009లో వివాహం చేసుకున్న ఇతనికి ఇద్దరు పిల్లలు. కొన్నేళ్లపాటు హైదరాబాద్‌లోని ఓ ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలో నివసించాడు. పిల్లలను ఏకంగా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివించాడు.
వ్యసనాల ఊబి: అయితే, క్రికెట్ బెట్టింగ్ వ్యసనంలో కూరుకుపోయి ఏకంగా రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మరింతగా నేరాల బాట పట్టాడు. భార్య సహకారంతో గంజాయి రవాణా కూడా ప్రారంభించాడు.
పోలీసులపైనే దాడులు: గతంలో పోలీసులకు పలుమార్లు చిక్కి జైలు శిక్ష అనుభవించాడు. 2019లో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడి చేసి తప్పించుకున్నాడు. మరో సందర్భంలో బేగంపేట రైల్వే పోలీసులపైనా కత్తితో దాడికి తెగించాడు.
పోలీసుల వల.. పడిందిలా : గత నెల 7న ఔరంగాబాద్-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికురాలి నుంచి నగదు, సెల్‌ఫోన్ దోచుకెళ్లిన ఘటనను రైల్వే ఎస్పీ చందన దీప్తి సవాలుగా తీసుకున్నారు.
ప్రత్యేక బృందాల వేట: నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు.
అరెస్ట్: పక్కా సమాచారంతో వికారాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో థానేదర్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి బంగారం, వెండి, నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పీడీ యాక్ట్: ప్రస్తుతం ఇతనిపై 62 కేసులు ఉన్నాయని, సమాజానికి అత్యంత ప్రమాదకరమైన ఇతనిపై పీడీ యాక్ట్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే ఎస్పీ చందన దీప్తి మీడియాకు వెల్లడించారు.


