Saturday, November 15, 2025
HomeతెలంగాణOrgan Donation: దేహం ఓ పాఠం.. అవయవం సజీవం!

Organ Donation: దేహం ఓ పాఠం.. అవయవం సజీవం!

Organ donation awareness in Warangal : మరణం అంచున కూడా మానవత్వపు పరిమళం వెదజల్లవచ్చు. ఆగిపోయిన శ్వాసతో ఎందరికో ఆయువు పోయవచ్చు. నిర్జీవమైన దేహం సైతం భావి వైద్యులకు ఓ అద్భుత పాఠం కావచ్చు. ఇది కల్పన కాదు, అవయవ, దేహదానంతో సాకారమవుతున్న అక్షర సత్యం. ఈ మహోన్నత ఆశయానికి ఊపిరి పోస్తూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘తెలంగాణ నేత్ర, అవయవ శరీర దాతల అసోసియేషన్‌’ ఓ నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. 

- Advertisement -

వైద్య విద్యకు అక్షర శ్రీకారం : ప్రతి వైద్య కళాశాలలో అనాటమీ విభాగమే విద్యార్థులకు పునాది. ఇక్కడే మానవ శరీరం యొక్క నిర్మాణం, పనితీరుపై వారికి తొలి పాఠాలు ప్రారంభమవుతాయి. ఈ పాఠాలకు జీవం పోసేవే దాతలు సమర్పించిన పార్థివదేహాలు. ఎవరైనా దేహదానం చేసినప్పుడు, ఆ శరీరం పాడవకుండా ఉండేందుకు రక్తనాళాల నుంచి రక్తాన్ని తొలగించి, ‘ఎంబాలింగ్‌ ఫ్లూయిడ్‌’ అనే ప్రత్యేక రసాయన మిశ్రమాన్ని ఎక్కిస్తారు. అనంతరం రసాయనాలతో నిండిన తొట్టిలో భద్రపరిచిన ఈ దేహాలను, వైద్య విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపిస్తూ శరీర భాగాల గురించి వివరిస్తారు. ఇది వారి అభ్యాసనలో అత్యంత కీలకమైన ఘట్టం.

అవగాహనే ఆయుధంగా :ఈ మహత్తర కార్యక్రమం వెనుక తెలంగాణ నేత్ర, శరీర అవయవదాతల అసోసియేషన్‌ అధ్యక్షుడు కొన్‌రెడ్డి మల్లారెడ్డి, కార్యదర్శి డా. రాజేంద్రప్రసాద్‌ల అవిరళ కృషి ఉంది. వీరి బృందం కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, ఒక వినూత్న పంథాను ఎంచుకుంది. మరణానంతరం నేత్ర, శరీరదానం చేసిన వారి సంస్మరణ సభలనే అవగాహన వేదికలుగా మార్చుకున్నారు. ఆత్మీయులను కోల్పోయిన దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అవయవదానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, వారిని ఈ బృహత్కార్యంలో భాగస్వాములను చేస్తున్నారు.

రాష్ట్రానికే ఆదర్శంగా ఓరుగల్లు : ఈ అసోసియేషన్ కృషితో నేడు అవయవ, దేహదానంలో వరంగల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 350కి పైగా సంస్మరణ సభలు, 250 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వైద్య విద్యార్థుల కోసం 156 పార్థివదేహాలను వివిధ వైద్య కళాశాలలకు అందించారు. వీటిలో కాకతీయ మెడికల్‌ కాలేజీకి 149, హైదరాబాద్‌ ఎయిమ్స్‌కు 3, జనగామ, కరీంనగర్‌ చల్మెడ మెడికల్‌ కాలేజీలకు కొన్ని చొప్పున ఉన్నాయి. అంతేకాకుండా, 300 నేత్రదానాలు, 150 అవయవదానాలు చేయించి ఎందరికో కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వారి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారంతో సత్కరించింది.

దాతృత్వానికి అర్హులెవరు? : ఆరోగ్యవంతులైన ఏ వయస్సు వారైనా అవయవ, దేహదానానికి అర్హులే. రక్త సంబంధీకులకు అవయవాలు దానం చేయడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం మరణానంతరం తమ దేహాన్ని వైద్య కళాశాలలకు, నేత్రాలను నేత్ర వైద్యశాలకు అందజేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపి, అంగీకార పత్రం ఇవ్వవచ్చు. ఈ గొప్ప కార్యక్రమాన్ని గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు సైతం అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad