Child Psychology Impact : సూర్యాపేట జిల్లాలో ఓ తండ్రికి ఇంట్లో పొగతాగే అలవాటు. రోజూ అది చూస్తున్న తొమ్మిదో తరగతి చదివే ఆయన కొడుకు కూడా ఆ వ్యసనానికి బానిసయ్యాడు. నల్గొండ జిల్లాలో మరో ఘటన. నిత్యం భార్యాభర్తల మధ్య గొడవలు, తిట్లు. ఆ మాటలు వింటూ పెరిగిన బాలిక, చుట్టుపక్కల వారితో అమర్యాదగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. మన ఇళ్లలో మనం సృష్టించే వాతావరణమే మన పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. తల్లిదండ్రుల ప్రతి కదలిక, ప్రతి మాట వారి లేత మనసులపై చెరగని ముద్ర వేస్తుంది. మరి, మన ప్రవర్తన వారిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అధ్యయనాలు, నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా చూద్దాం.
పిల్లలే మన ప్రతిబింబాలు : “తల్లిని చూసి పిల్ల, కుండను చూసి కూజా” అన్నట్టు పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులనే అనుకరిస్తారు. వారి ప్రవర్తనే పిల్లలకు పాఠ్యపుస్తకం. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సర్వే ప్రకారం, మూడు సంవత్సరాలలోపు పిల్లలతో తల్లిదండ్రులు ఎలా మాట్లాడతారు, వారితో ఎలా నడుచుకుంటారు అనే విషయాలు వారి జీవితకాలంపై ప్రభావం చూపుతాయి. 2018లో సిగ్మా అనే హెల్త్ సర్వీసెస్ సంస్థ 20,000 మందితో జరిపిన అధ్యయనంలో ఎక్కువ శాతం మంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తేలింది. దీనికి కారణం చిన్నతనంలో వారు ఒంటరిగా పెరగడమేనని వెల్లడైంది.
చేయకూడని పనులు.. పలకకూడని మాటలు : పిల్లల పెంపకం ఓ సున్నితమైన యజ్ఞం. ముఖ్యంగా వారి ముందు తల్లిదండ్రులు సంయమనం పాటించడం అత్యంత అవసరం. పిల్లల ముందు కోపతాపాలకు పోవడం, వాదించుకోవడం, అసభ్య పదజాలం ఉపయోగించడం వంటివి వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అమ్మానాన్నల మధ్య ప్రేమ ఉందా? లేదా? అనే విషయాలు వారి చిట్టి బుర్రలో గట్టి ముద్ర వేస్తాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోతే పిల్లల్లో భయం, ఆందోళన, అభద్రతాభావం వంటివి పెరిగి వారి ప్రవర్తనలో తేడాలు వస్తాయి.
నేర్పించాల్సిన నడవడిక.. అలవర్చాల్సిన బాధ్యత : పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే కొన్ని విషయాలను చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి.
బాధ్యత: వారి వయసుకు తగిన చిన్న చిన్న పనులు అప్పగించాలి. ఇది వారిలో క్రమశిక్షణ, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.
ప్రోత్సాహం: పిల్లలను బెదిరించడం, కొట్టడం కాకుండా, వారు చేసే మంచి పనులను ప్రశంసలతో, చిన్న బహుమతులతో ప్రోత్సహించాలి.
సమయం: రోజూ వారితో కాసేపు మాట్లాడటం, ఆడుకోవడం, పాఠశాల విషయాలు అడిగి తెలుసుకోవడం వల్ల వారు మీతో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు.
పోల్చవద్దు: మీ పిల్లలను ఇరుగుపొరుగు పిల్లలతో అస్సలు పోల్చవద్దు. ఇది వారిలో ఆత్మన్యూనత భావంతో పాటు, తల్లిదండ్రులపై ద్వేషాన్ని కూడా పెంచుతుంది.
కలిసి భోజనం: కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా భోజనం చేయండి. ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది.
తల్లిదండ్రులే తొలి గురువులు – నిపుణుల మాట : “ఈ మధ్య కాలంలో పిల్లలు మాట వినడం లేదని, చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారని చాలామంది తల్లిదండ్రులు ఆసుపత్రికి వస్తున్నారు. పిల్లలకు తల్లిదండ్రులే రోల్ మోడల్స్‌గా ఉండాలి. వారి అవసరాలను అర్థం చేసుకుని, ఏ విషయాన్నైనా సున్నితంగా వివరించాలి. వారిలో సానుకూల మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి,” అని హైదరాబాద్‌కు చెందిన మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఉస్మాన్ సూచిస్తున్నారు.


