తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ సంస్కృతి పరవడిల్లుతోందనీ మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ కేపిఆర్ మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులను ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..నియోజకవర్గం లోని ముస్లింల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిరుపేద ముస్లింల అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఐనోలు గ్రామ శివారులోని టీఆర్ఆర్ కళాశాల సమీపంలో ఐదు ఎకరాల స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.