Train connectivity to Tirupati : శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా భక్తులకు ఇది శుభవార్త! ఇకపై తిరుమల ప్రయాణం మరింత సులభతరం కానుంది. రైళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా, వారంలో ఏకంగా ఆరు రోజుల పాటు తిరుపతికి చేరుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న రైళ్లకు తోడు, కొత్తగా మరో ప్రత్యేక రైలు పట్టాలెక్కనుండటంతో భక్తులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, ఈ కొత్త రైలు ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది..? ఏయే రోజుల్లో ఏ రైళ్లు అందుబాటులో ఉంటాయి..?
పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి కలియుగ దైవం కొలువైన తిరుపతికి రైళ్ల అనుసంధానం గణనీయంగా మెరుగుపడింది. ప్రయాణికుల రద్దీ, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే, నాందేడ్ డివిజన్ అధికారులు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పెరిగిన రైళ్ల సంఖ్య.. వారానికి ఆరు : ప్రస్తుతం పెద్దపల్లి మీదుగా తిరుపతికి వెళ్లే రైళ్ల సంఖ్య పెరగడంతో, ప్రయాణికులకు వారంలో ఆరు రోజుల పాటు ప్రయాణ సౌలభ్యం కలగనుంది.
కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ): ప్రతి గురువారం, ఆదివారం.
నాందేడ్-తిరుపతి ప్రత్యేక రైలు (వీక్లీ): గత నెలలో ప్రారంభమైన ఈ రైలు ప్రతి శనివారం రాత్రి 10:05 గంటలకు పెద్దపల్లికి వస్తుంది.
కొత్తగా: నాందేడ్-ధర్మవరం ప్రత్యేక రైలు (వీక్లీ): సెప్టెంబర్ 5 నుంచి ఇది ప్రతి శుక్రవారం రాత్రి 10:05 గంటలకు పెద్దపల్లి మీదుగా తిరుపతికి వెళ్తుంది.
లాల్‌కౌన్ జంక్షన్ – KSR బెంగళూరు ప్రత్యేక రైలు: ప్రతి ఆదివారం రాత్రి 8:20 గంటలకు పెద్దపల్లికి వచ్చి, సోమవారం ఉదయం 8:30కు తిరుపతి చేరుకుంటుంది.
దన్‌బాద్-కోయంబత్తూరు ప్రత్యేక రైలు: ప్రతి ఆదివారం రాత్రి 11:09 గంటలకు పెద్దపల్లికి వచ్చి, సోమవారం ఉదయం 10:30కు రేణిగుంట వెళ్తుంది.
సెప్టెంబర్ 5న పట్టాలెక్కనున్న కొత్త రైలు : నాందేడ్-ధర్మవరం ప్రత్యేక రైలు (తిరుపతి మీదుగా) సెప్టెంబర్ 5 నుంచి ప్రయోగాత్మకంగా పట్టాలెక్కనుంది.
షెడ్యూల్: ప్రతి శుక్రవారం సాయంత్రం 4:30కు నాందేడ్‌లో బయలుదేరి, నిజామాబాద్ (6:25 PM), జగిత్యాల (8:00 PM), కరీంనగర్ (9:00 PM), పెద్దపల్లి (10:05 PM) మీదుగా ప్రయాణించి, శనివారం ఉదయం 11:00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణం: ఆదివారం ఉదయం 5:30కు ధర్మవరంలో బయలుదేరి, అదే రోజు ఉదయం 10:25కు తిరుపతికి వచ్చి, సోమవారం మధ్యాహ్నం 12:05 గంటలకు పెద్దపల్లికి చేరుకుంటుంది.
కొనసాగింపు: ప్రయాణికుల రద్దీని బట్టి ఈ రైలును కొనసాగించడం లేదా క్రమబద్ధీకరించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
దారి మళ్లింపు.. పుణ్యక్షేత్రాల అనుసంధానం : గతంలో నాందేడ్ నుంచి బయలుదేరిన ఈ ప్రత్యేక రైలు నిజామాబాద్-కామారెడ్డి-నల్గొండ మార్గంలో నడిచేది. అయితే ఆదరణ కరువవడంతో, ఇప్పుడు నిజామాబాద్-జగిత్యాల-పెద్దపల్లి మార్గంలోకి మళ్లించారు. ఈ మార్పు వల్ల ప్రయాణికులు బాసరలోని జ్ఞాన సరస్వతి, వరంగల్‌లోని భద్రకాళి, విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తి, తిరుపతి, కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వంటి అనేక పుణ్యక్షేత్రాలను నేరుగా దర్శించుకునే అవకాశం ఏర్పడింది.
మరిన్ని హాల్టింగ్‌లు కల్పించాలి : ప్రతి సోమ, గురు, శనివారాల్లో నడిచే ఏపీ సంపర్క్‌క్రాంతి, బుధవారం నడిచే హిమ్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లకు కూడా పెద్దపల్లిలో హాల్టింగ్ కల్పిస్తే ఉమ్మడి జిల్లా వాసులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇటీవల పెద్దపల్లి-నిజామాబాద్ మార్గానికి అనుసంధానం చేసే బైపాస్ లైన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయన్న వార్తలతో రైళ్లు రద్దవుతాయేమోనని ఆందోళన చెందిన భక్తులు, ఇప్పుడు కొత్త రైలు అందుబాటులోకి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


