Rapid organic fertilizer production : రసాయనాలతో నిస్సారమవుతున్న నేలలు.. ఆకాశాన్నంటుతున్న ఎరువుల ధరలు.. పర్యావరణ కాలుష్యంతో కునారిల్లుతున్న భూమాత. ఈ సమస్యలన్నింటికీ ఒకేఒక్క సమాధానం దొరికితే? కళ్లముందే కుళ్లిపోతున్న చెత్తను కేవలం ఆరు గంటల్లో బంగారమంత విలువైన సేంద్రియ ఎరువుగా మార్చే అద్భుత సాంకేతికత అందుబాటులోకి వస్తే? ఇది కల కాదు.. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వేసిన విప్లవాత్మక ముందడుగుతో త్వరలో సాకారం కాబోతున్న నిజం! అసలు ఈ ఆరు గంటల అద్భుతం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అగ్నిపర్వతాల నుంచి వచ్చిన బ్యాక్టీరియాకు, ఎరువుల తయారీకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతోంది?
రసాయన ఎరువుల కబంధ హస్తాల నుంచి తెలుగు నేలను విడిపించేందుకు, రైతుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన పోషకాలను అందించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) చరిత్రాత్మక ముందడుగు వేసింది. వియత్నాంకు చెందిన ‘బయోవే ఇంటర్నేషనల్ ఆర్గానిక్ ప్రైవేటు లిమిటెడ్’ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
రూ.5 కోట్లతో అత్యాధునిక యూనిట్: ఈ ఒప్పందంలో భాగంగా, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బయోవే సంస్థ రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఎరువుల ఉత్పత్తి కేంద్రాన్ని (మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్) నెలకొల్పనుంది.
ముడిసరుకు మన చెత్తే: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోని వ్యర్థాలు, కూరగాయల వ్యర్థాలు, పశువుల పేడ, గృహ వ్యర్థాలు.. ఇలా ప్రతి జీవ వ్యర్థాన్ని అధిక పోషక విలువలున్న సేంద్రియ ఎరువుగా మార్చడమే ఈ యూనిట్ లక్ష్యమని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య స్పష్టం చేశారు.
ఆరు గంటల అద్భుతం.. సాంకేతికత ఇదే : సాధారణంగా సేంద్రియ ఎరువు తయారీకి నెలల సమయం పడుతుంది. కానీ, ఈ కొత్త టెక్నాలజీతో కేవలం ఆరు గంటల్లోనే ఎరువు సిద్ధమవుతుంది.
అగ్నిపర్వత బ్యాక్టీరియా: ఈ అద్భుతం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా. అమెరికన్ శాస్త్రవేత్తలు అగ్నిపర్వతాల నుంచి సేకరించిన ఈ బ్యాక్టీరియాకు ఒక విశిష్ట లక్షణం ఉంది.
అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి: ఇది 120 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ల అధిక ఉష్ణోగ్రతలో కూడా జీవించి ఉండగలదు. ఈ సామర్థ్యం వల్లే జీవ వ్యర్థాలను కుళ్లింపజేసే ప్రక్రియ (డీకంపోజిషన్) అత్యంత వేగంగా జరిగి, కేవలం ఆరు గంటల్లోనే నాణ్యమైన ఎరువు తయారవుతుంది.
అంతర్జాతీయ భాగస్వామ్యం.. భారత్‌లో ప్రథమం: రాబోయే మూడు నెలల్లో వియత్నాం నుంచి బయోవే కంపెనీ ప్రతినిధులు వచ్చి యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
వియత్నాం ప్రశంసలు: వ్యవసాయ వర్సిటీతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం భారత్‌లో తమ సంస్థకు ఇదే తొలి ఒప్పందమని వియత్నాం డిప్యూటీ అంబాసిడర్ న్గుయెన్ కాంగ్ టాన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 12 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇది 13వ ఒప్పందం అని ప్రకటించారు.
రైతుకు, పర్యావరణానికి ప్రయోజనం: ఈ ప్రాజెక్టు ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రైతుకు మేలు: రసాయనిక ఎరువులపై ఆధారపడటం తగ్గుతుంది. తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గి, భూసారం పెరుగుతుంది.
ప్రభుత్వానికి ఊరట: ఎరువుల రాయితీల భారం గణనీయంగా తగ్గుతుంది.
పర్యావరణ పరిరక్షణ: వ్యర్థాల సమస్యకు పరిష్కారం లభించడమే కాకుండా, భూమి, నీరు, వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. రెండేళ్ల పాటు ఈ యూనిట్‌లో తయారైన ఎరువుల నాణ్యతను, పంటలపై దాని ప్రభావాన్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, పెద్ద ఎత్తున రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది.


