తెలంగాణలో ట్రాన్స్ జెండర్ల (Transgenders)కి ఉపాధి కల్పించే విషయంపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నియంత్రణకు వారి సేవలను ఉపయోగించుకోవాలని సూచించిన ఆయన.. దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
సీఎం ఆదేశాలతో దీనిపై కసరత్తు ప్రారంభించిన అధికారులు, ట్రాన్స్ జెండర్లను పోలీసు శాఖలోకి తీసుకొనేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ జెండర్ల (Transgenders) నియామకాలు షురూ చేసింది. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సెలెక్షన్ ప్రాసెస్ ప్రారంభించింది. బుధవారం ఉదయం హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో పోలీస్ అధికారులు ఈవెంట్స్ నిర్వహించారు. అభ్యర్థులకు రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ టెస్టులు చేపట్టారు.
ఈవెంట్స్ స్కోర్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో ఉద్యోగాలు కల్పించనున్నారు. కాగా, ట్రాన్స్ జెండర్ పోలీస్ నియామాకాల్లో భాగంగా తొలి రోజు మొత్తం 58 మంది అభ్యర్థులు ఈవెంట్స్ కి హాజరయ్యారు. వీరిలో 44 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో 29 మంది ఉమెన్, 15 మంది మెన్ ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు ఉన్నారు. 18 ఏండ్లు పూర్తై పదవ తరగతి పాసవడంతో పాటు ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు పోలీసులు ఈవెంట్స్ నిర్వహించారు. అభ్యర్థులకు 800 మీటర్స్,100 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు.