ఆటో కార్మికులపై(Auto Drivers) బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) విమర్శించారు. ఆటో కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే పదేళ్ల మీ పాలనలో వారి కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మెట్రో రైలు వస్తే ఇతర వాటిపై ప్రభావం పడుతుందని చెప్పడం ఎంత తప్పో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తే ఆటో సర్వీసులపై ప్రభావం పడుతుందని చెప్పడం అంతే తప్పని అన్నారు. బస్సులు ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళకుండా బస్టాండ్ దగ్గర మాత్రమే ఆగుతాయని.. అక్కడి నుంచి ఇంటి వద్దకు వెళ్లేందుకు ఆటో సేవలను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
ఆటో కార్మికులకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చామని.. కానీ బీఆర్ఎస్ పాలన వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ ఏడాది ఇవ్వలేకపోయామని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఆటో కార్మికులను తప్పకుండా ఆదుకుంటామని చెప్పుకొచ్చారు. ఆటో కార్మికుల డ్రెస్‌లు వేసుకోవడం, చేతులకు బేడీలు వేసుకొని వేషాలు వేయడం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న రాజకీయ డ్రామా అని పొన్నం మండిపడ్డారు. కాగా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గులాబీ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్ల యూనిఫాం వేసుకుని అసెంబ్లీకి వచ్చారు.