మున్నేరు వరద బాధితులకు సర్కారు అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. నగరంలోని మున్నేరు ముంపు ప్రాంతాలైన వేంకటేశ్వరనగర్, పద్మావతినగర్, బొక్కల గడ్డ, మోతీనగర్ లోని వరద బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసర సరుకులు, స్థానిక కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు అధ్వర్యంలో సమకూర్చిన 6 రకాల కూరగాయలను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.
పువ్వాడ ఫౌండేషన్, మమత ఆసుపత్రి సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును మంత్రి ప్రారంభించి, ఉచిత మందులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుపెన్నడూ లేని విధంగా మున్నేరు ఉధృతిని చూశామని, అయిన ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలందరినీ కాపాడుకున్నామని అన్నారు. ఇంట్లో నష్టపోయిన వస్తువుల నష్టాన్ని భర్తీ చేసేందుకు తమవంతు సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.
మున్నేరుకు రూ.147 కోట్లతో ఆర్సిసి వాల్ నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశామని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళామని, త్వరలోనే వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపిలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, మునిసిపల్ డిప్యూటీ కమీషనర్ మల్లేశ్వరి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.