Police Initiative for Elderly Safety : పిల్లలు ప్రయోజకులై దేశ విదేశాల్లో స్థిరపడితే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులే ఉండవు. కానీ, ఆ ఆనందం వెనుక… వృద్ధాప్యంలో ఒంటరితనం అనే చేదు నిజం పొంచి ఉంటుంది. ఆపద వస్తే ఆదుకునేవారెవరు..? అనారోగ్యం పాలైతే చూసుకునేదెవరు..? అనే ఆందోళన వారిని రోజూ కుంగదీస్తుంది. ఈ నిస్సహాయతే నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు, ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు ‘మేమున్నామంటూ’ భరోసా ఇచ్చేందుకు రాచకొండ పోలీసులు ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఏమిటా కార్యక్రమం? అది ఎలా పనిచేస్తుంది..? వృద్ధులకు ఎలా అండగా నిలవనుంది..?
ఆసరాగా చేసుకుని.. నేరాల దాడి : ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవడం, పిల్లలు ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు వలస వెళ్లడంతో ఒంటరి వృద్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారి ఒంటరితనాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
ఆస్తి కోసం దాడులు: భూములు, డబ్బు కోసం వృద్ధులపై దాడులు చేయడం, కొన్నిసార్లు దారుణంగా హత్య చేయడం.
దొంగతనాల పరంపర: ఇంట్లో చొరబడి దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడటం.
సాయం పేరుతో మోసం: అనారోగ్యంతో ఉన్నవారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ, వారి ఆస్తి పత్రాలు, విలువైన వస్తువులను కాజేయడం.
సైబర్ వల: డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ‘డిజిటల్ అరెస్ట్’ వంటి మోసాలతో లక్షలు కొల్లగొట్టడం. కొన్ని సందర్భాల్లో, అనారోగ్యంతో మరణించినా ఆ విషయం రోజుల తరబడి బయటి ప్రపంచానికి తెలియని దయనీయమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
‘కేర్ డెస్క్’.. భరోసా ఇచ్చేలా : సీనియర్ పౌరుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే ఉద్దేశ్యంతో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ‘సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్’ను అన్ని పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి తేనున్నారు. ఇది వృద్ధులకు సమగ్రంగా సహాయం అందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమం పనిచేసేదిలా..
గుర్తింపు ప్రక్రియ: కమిషనరేట్ పరిధిలోని 47 పోలీస్ స్టేషన్ల పరిధిలో, 70 ఏళ్లు దాటి ఒంటరిగా నివసిస్తున్న (ఒంటరిగా లేదా దంపతులు) వృద్ధులను గుర్తిస్తారు. ముఖ్యంగా పిల్లలు విదేశాల్లో ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
రికార్డుల నిర్వహణ: ఇలా గుర్తించిన వృద్ధుల పూర్తి చిరునామా, వివరాలతో ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక ప్రత్యేక రికార్డును నిర్వహిస్తారు. ఇప్పటికే సుమారు 550 మందిని గుర్తించారు.
నిరంతర పర్యవేక్షణ: స్థానిక సెక్టార్ ఎస్సైలు, పెట్రోలింగ్ సిబ్బంది తమ గస్తీ సమయంలో తప్పనిసరిగా ఈ వృద్ధుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను విచారించాలి. వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి.
కేంద్రీకృత పర్యవేక్షణ: నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధాన ‘కేర్ డెస్క్’ నుంచి, పోలీస్ స్టేషన్ల వారీగా జరుగుతున్న పనులను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు తరచుగా వారిని కలవడం వల్ల, వృద్ధుల్లో ఒంటరి అనే అభద్రతా భావం తొలగిపోయి, మానసిక ధైర్యం పెరుగుతుంది. ఏ చిన్న సమస్య వచ్చినా పోలీసులకు చెప్పుకోవచ్చనే భరోసా కలుగుతుంది. తద్వారా వారిపై జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


