Weather forecast for Telugu states : కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు, ఇప్పుడు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవ్వనున్నాయి. రానున్న 24 గంటలు అత్యంత కీలకమని, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అసలు ఈ అల్పపీడనం ఎక్కడ ఏర్పడుతోంది..? ఏయే జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉండనుంది..? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
సముద్రంలో ఏం జరుగుతోంది : వాయువ్య బంగాళాఖాతంలో, ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి, రాగల 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీనికి తోడు రుతుపవన ద్రోణి కూడా చురుగ్గా ఉండటంతో వర్షాలు తీవ్రరూపం దాల్చనున్నాయి.
తెలంగాణకు భారీ వర్ష సూచన : అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ప్రభావిత జిల్లాలు: ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్.
హెచ్చరిక: ఈ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, పాత భవనాల వద్ద నిలబడరాదని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ దంచికొట్టనున్న వానలు : ఆంధ్రప్రదేశ్‌లోనూ నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
ప్రభావం: రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
తీవ్రత: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ఆర్టీసీ కాంప్లెక్స్, రైతు బజార్, ఇలిసిపురం జంక్షన్ వంటి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల సూచనలు : రెండు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.


