సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) మరోసారి విమర్శలు చేశారు. కొంతకాలంగా బీజేపీ నేతలపై రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలోని కొంతమంది నేతలు రహస్యంగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి నేతలను బయటకి పంపిస్తేనే పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తుండగానే మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.
మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం అని మాజీ మంత్రి కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. గతంలో కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైలుకి పంపారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తనని అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఏమి చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా సొంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు.
“మా బీజేపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి జైలుకి పంపారు. లాఠీఛార్జ్ చేశారు. నాపై పీడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. నాపై పీడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో మా బీజేపీ నేతలు పోలీసులకు సపోర్ట్ గానే ఉన్నారు. రాజాసింగ్ నీపై పీడీ యాక్ట్ వేస్తున్నాం. మీ బీజేపీ వాళ్లు కూడా వేయండి అన్నారని ఓ పోలీసు అధికారి నాకు చెప్పారు. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారులను ఏం చేయాలి? ఈ రోజు కూడా చాలామంది బీజేపీ నాయకులు నన్ను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న, మా కార్యకర్తలు నా వెంబడి నిలబడ్డారు. ఇప్పుడు కూడా మా అన్న మా వెంబడే ఉన్నారని నేను అనుకుంటున్నాను. కానీ మా అన్న ఎటువైపు ఉన్నారో అర్థం కావడం లేదు” వ్యాఖ్యానించారు. అయితే ఎవరిని ఉద్దేశించి రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.