లక్షలు పెట్టి కొనుగోలు చేసిన అంబులెన్స్ వాహనం నిరుపయోగంగా మారి ప్రజా ప్రతినిధుల అలసత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. అత్యవసర వైద్య సేవలు అవసరం ఉన్న వారికి మెరుగైన వైద్య సేవల కోసం పట్టణ ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్ వాహనం నిర్వహణ భారంతో నిరూపంగా ఉండడం పట్ల స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాల్ రావు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2023-24 ఆర్థిక సంవత్సరం ఎంపీ నిధులతో గత సంవత్సరం ఎంపీ బండి సంజయ్ అంబులెన్స్ వాహనాన్ని కేటాయించారు. సంజయ్ సురక్ష పేరుతో అంబులెన్స్ వాహనాన్ని వైద్య సేవలు అవసరం ఉన్న వారి కోసం కేటాయించినప్పటికీ నిర్వాహణ భారంతో అది ఉపయోగంలోకి రావడం లేదు. అంబులెన్స్ వాహనాన్ని అత్యవసర వైద్య సేవలకు ఉపయోగించుకునే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం ఉండడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన వాహనం నిరూపయోగంగా ఉండి ఏమీ లాభం అంటూ తమ సంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా ప్రజాధనం అంటే ఎందుకింత నిర్లక్ష్యం అంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి అంబులెన్స్ వాహనాన్ని అత్యవసర వైద్య సేవలకు ఉపయోగించుకునే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. దీనిపై మన పాలకులు, ఉన్నతాధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూద్దాం.