Saturday, November 15, 2025
HomeతెలంగాణRangareddy Accident : చేవెళ్లలో పెను విషాదం..ప్రమాదానికి కారణం అదే: మంత్రి పొన్నం

Rangareddy Accident : చేవెళ్లలో పెను విషాదం..ప్రమాదానికి కారణం అదే: మంత్రి పొన్నం

Rangareddy Road Accident :  ఆ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ప్రశాంతంగా గమ్యం వైపు సాగుతోంది. ఇంతలో మృత్యుశకటం రూపంలో ఓ టిప్పర్ రాంగ్ రూట్‌లో దూసుకొచ్చింది. క్షణాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నెత్తురోడింది. 21 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. ఇంతటి ఘోరానికి కారణం కేవలం టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమేనా? అసలు ఆ ప్రమాదకర క్షణంలో ఏం జరిగింది? ఆ వివరాల్లోకి వెళ్తే..

- Advertisement -

కంకర కింద సమాధి : తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 70 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఎదురుగా రాంగ్ రూట్‌లో వేగంగా వస్తున్న కంకర టిప్పర్, రహదారిపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి బస్సును బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా, టిప్పర్ మొత్తం బస్సుపైకి ఒరిగిపోయింది. దీంతో టిప్పర్‌లోని కంకర మొత్తం కిటికీల పక్కన కూర్చున్న ప్రయాణికులపై పడింది. చాలామంది ఆ కంకర రాళ్ల కింద కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు మూడు జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని, కంకర కింద కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీశారు.

ప్రమాదానికి కారణం అదే: మంత్రి పొన్నం : ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హుటాహుటిన రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. “టిప్పర్ లారీ రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు తెలిపారు,” అని మంత్రి పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆయన ఆదేశించారు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా, సహాయక చర్యల్లో పాల్గొంటున్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కూడా గాయపడటం ఆందోళన కలిగించింది. సహాయక చర్యల్లో భాగంగా జేసీబీ ప్రమాదవశాత్తు ఆయన కాళ్లపైకి ఎక్కడంతో గాయాలయ్యాయి. బస్సు కండక్టర్ రాధకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనతో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad