పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంస్కృతిక సారధి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గంట మైహిపాల్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి విగ్రహాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణానికి హనికరం కాకుండా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని, మట్టి గణపతి విగ్రహాలే మహా గణపతులని, కృత్రిమ విగ్రహాలను వాడటం మానవాళికి శ్రేయస్కరం కాదని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మట్టి గణపతి పూజించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు ఉపసర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.