అంగన్ వాడి టీచర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అంగన్ వాడి టీచర్లు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వాల హయాంలో అంగన్ వాడి టీచర్లకు తక్కువ వేతనం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక అంగన్ వాడి టీచర్లకు 13650 వేతనం ఇస్తున్నారని, దేశంలో ఎక్కడా కూడా తెలంగాణ మాదిరిగా అంగన్ వాడి టీచర్లకు ఎక్కువ వేతనాలు ఇవ్వడం లేదని, సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలనే లక్ష్యంతో వేతనాలు పెంచి ఇస్తున్నారని, అంగన్ వాడి టీచర్లు తెలంగాణ ప్రభుత్వానికి వారధి లాంటివారని, అంగన్ వాడి టీచర్ల సమస్యలను సీయం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తానని ఎమ్మెల్యే రసమయి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి రామ కృష్ణా రావు, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.