Saturday, November 15, 2025
HomeతెలంగాణForgery Scam: ఆర్డీవో సంతకం ఖ‘ల్తీ’.. హెచ్‌ఎండీఏ అనుమతి ‘గల్తీ’!

Forgery Scam: ఆర్డీవో సంతకం ఖ‘ల్తీ’.. హెచ్‌ఎండీఏ అనుమతి ‘గల్తీ’!

HMDA approval with forged documents  : అధికారిక సంతకానికే ఎసరు.. అక్రమ నిర్మాణాలకు సర్కారీ ఆమోదం! నగర శివార్లలో ఓ స్థిరాస్తి సంస్థ ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఏకంగా ఆర్డీవో సంతకాన్నే ఫోర్జరీ చేసి, ఏకంగా 600 ఫ్లాట్ల నిర్మాణానికి అనుమతులు సంపాదించింది. మరింత విస్మయకరమైన విషయం ఏమిటంటే, రాష్ట్రంలోనే అత్యున్నత పట్టణాభివృద్ధి సంస్థ అయిన హెచ్‌ఎండీఏ, ఆ దొంగ పత్రాలను చూసి కళ్లుమూసి అనుమతి ఇచ్చేయడం. అసలు ఇంత పెద్ద మోసం ఎలా సాధ్యమైంది? దొంగ పత్రాలను గుర్తించడంలో హెచ్‌ఎండీఏ అధికారులు ఎందుకు విఫలమయ్యారు? ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఎంత?

- Advertisement -

అసలు కథ ఇదీ : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టి అన్నారంలో ఓ స్థిరాస్తి సంస్థ, భారీ అపార్ట్‌మెంట్ సముదాయం నిర్మించాలని ప్రణాళిక రచించింది. తమ వద్ద ఉన్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిని, ఏడేళ్ల క్రితమే వ్యవసాయేతర భూమిగా (నాలా కన్వర్షన్) మార్చుకున్నారు. అయితే, ఆ భూమి పక్కనే ఉన్న మరో ఎకరం భూమికి మాత్రం ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. మొదట రెండెకరాలకు లే-అవుట్ వేసి హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందారు. ఆ తర్వాత, మిగిలిన ఎకరం భూమికి చట్టబద్ధంగా ‘నాలా’ మార్పిడి చేయకుండా, ఏకంగా ఇబ్రహీంపట్నం ఆర్డీవో సంతకాన్నే ఫోర్జరీ చేసి హెచ్‌ఎండీఏకు దరఖాస్తు సమర్పించారు.

కళ్లు మూసుకున్న హెచ్‌ఎండీఏ : సాధారణంగా లే-అవుట్ అనుమతులు ఇచ్చే ముందు హెచ్‌ఎండీఏ అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో సమన్వయం చేసుకుని, పత్రాల యథార్థతను నిర్ధారించుకోవాలి. కానీ, ఈ కేసులో ఆ ప్రక్రియ ఏదీ జరిగినట్లు లేదు. ఫోర్జరీ సంతకంతో ఉన్న పత్రాన్ని చూసీ చూడనట్లుగా వదిలేసి, నిర్మాణానికి పచ్చజెండా ఊపేశారు. దీంతో ఆ సంస్థ దర్జాగా పనులు ప్రారంభించింది.

బయటపడ్డ బాగోతం : ఇటీవల నిర్మాణ పనులు జరుగుతుండగా, అనుమానం వచ్చిన స్థానిక రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఆర్డీవో అనుమతి పత్రం నకిలీదని తేలడంతో, ఇబ్రహీపట్నం ఆర్డీవో అనంతరెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తునకు అధికారుల బృందం : ఈ మోసంపై హెచ్‌ఎండీఏ అధికారులను ప్రశ్నించగా, వారు సరైన సమాధానం ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మూడు నెలలుగా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా జాప్యం చేస్తుండటంతో, నిందితుల అరెస్టు ఆలస్యమవుతోందని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. ఫోర్జరీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన, కొందరు అధికారుల అవినీతి, నిర్లక్ష్యం కారణంగా సామాన్యుడి సొంతింటి కల ఎలా ప్రమాదంలో పడుతోందో చెప్పడానికి నిలువుటద్దంలా నిలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad