బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి(Jeevan Reddy) సుప్రీంకోర్టులో(Supreme Court) ఊరట లభించింది. మొయినాబాద్ ప్రాంతంలో ప్రైవేటు భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది.
గతంలో ఈ కేసుకు సంబంధించి జీవన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం జీవన్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ దర్యాప్తునకు సహకరించని పక్షంలో విచారణాధికారులు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.