మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు మృతి చెందడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“కుంభమేళాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నాచారంకు చెందిన పలువురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్య సేవలు అందేలా మధ్యప్రదేశ్ అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించడం జరిగింది. మృతుల భౌతికకాయాలను స్వస్థలానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది” అని తెలిపారు.
కాగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా(Kumbh Mela)కు వెళ్లిన కొందరు రోడ్డు ప్రమాదానికి(Road Accident) గురయ్యారు. పుణ్యస్నానం ఆచరించి తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా పరిధిలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇవాళ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.