Monday, November 17, 2025
HomeతెలంగాణBhubharati clears all land issues: ధరణిని బొందబెట్టినం..ఇక భూ సమస్యలుండవ్

Bhubharati clears all land issues: ధరణిని బొందబెట్టినం..ఇక భూ సమస్యలుండవ్

Revanth Reddy: ధరణి తెచ్చిన సమస్యలతో విసిగి ఓ రైతు ఇబ్రహీంపట్నంలో అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సిరిసిల్లలో అధికారులపై ఓ మహిళ తాళి బొట్టు విసిరిన దుస్థితి. ఇదంతా అధికారుల వల్ల జరగలేదు.. నాటి పాలకులు సృష్టించిన వైరస్. అందుకే ధరణి వ్యవస్థను సమూలంగా నిర్మూలించాం.
– సీఎం రేవంత్‌రెడ్డి

బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో ధరణి భూతాన్ని తెచ్చి భూములు కొల్లగొట్టాలని చూశారని, వారి దోపిడీకి అడ్డుగా ఉన్న వీఆర్వో, వీఆర్ఏలనే దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్​లో ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో గ్రామ పరిపాలన అధికారులకు(జీపీవో) నియామక పత్రాలు అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఆనాడు చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం ధరణి మహమ్మారిని వదిలించి భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో పరిష్కరించే ప్రయత్నం చేశామన్నారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వీఆర్వో, వీఆర్‌ఏలను తిరిగి నియమించామని తెలిపారు. ‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయనే కారణంతో ఇల్లు తగలబెట్టుకోం. అలా కొందరు తప్పులు చేశారనే పేరుతో మొత్తం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం కూడా తప్పే’ అని సీఎం అన్నారు. ప్రజా ప్రభుత్వ స్థాపనలో, తెలంగాణ సాధనలో భాగస్వాములైన రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత పాలకులు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారని విమర్శించారు. ‘లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది. మరి వాళ్లపై ఎలాంటి చర్య తీసుకోవాలి?’ అని ప్రశ్నించారు. భూ భారతి చట్టాలను అమలు చేయడంతో పాటు సాదాబైనామాల సమస్యను పరిష్కరించడంలో రెవెన్యూ సిబ్బంది ముందుండాలని ఈ సందర్భగా సీఎం రేవంత్‌ సూచించారు. ఇది మీ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని గుర్తు చేశారు. గత పాలకులు రెవెన్యూ ఉద్యోగులను సమాజంలో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘మీ మీద పడ్డ మచ్చను చెరుపుకునే అవకాశం ఇప్పుడు మీకు లభించింది. ప్రజల సమస్యలను పరిష్కరించి ఆ ఆరోపణలు తప్పని నిరూపించండి’ అని సూచించారు.

- Advertisement -

ఆత్మహత్యలు చేసుకున్నా ఆర్టీసీలో సమస్యలు తీరలే
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా వారి సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేదని సీఎం మండిపడ్డారు. భూమి కోసం జరిగిన పోరాటాలను గుర్తుచేసిన ఆయన.. కొమురంభీం, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి లాంటి నాయకులు భూహక్కుల కోసం పోరాడారని పేర్కొన్నారు. వెదిరె రామచంద్రా రెడ్డి వేలాది ఎకరాలను పేదలకు పంచి భూదానోద్యమానికి పునాదులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే పీవీ నర్సింహారావు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేశారని తెలిపారు. ‘భూమిని చెరబట్టిన వారిని తెలంగాణ ప్రజలు చరిత్రలో తరిమారు. భూమి హక్కులే తెలంగాణ చరిత్రలో ప్రధాన పోరాటాల మూలం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

సాదాబైనామాలకు మోక్షం
త్వరలో 9 లక్షల సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన జరగాలని సీఎం అన్నారు. ‘ఏ సమాజంలోనైనా, ఎంత గొప్ప వ్యవస్థలోనైనా 5 శాతం చెడ్డ వాళ్లు ఉంటారు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. వీఆర్వోలు, వీఆర్ఏలు, తహశీల్దార్లు తప్పులు చేస్తే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప సొంతింటిని తగులబెట్టుకోవడం సరైంది కాదు. అలాగే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థల రద్దు అలాగే జరిగింది’ అని అన్నారు. 20 నెలల పాలనలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. వీఆర్వో, వీఆర్ఏలు లేని లోటు ప్రభుత్వ పథకాల అమలులో కనిపించిందన్నారు. వీఆర్వో, వీఆర్ఏలపై దుర్మార్గులని ముద్ర వేశారు. అలాంటి వ్యవస్థను తిరిగి తీసుకొస్తే మళ్లీ చెడ్డ పేరు వస్తుందని మంత్రివర్గ సహచరులు అన్నారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. లక్ష కోట్లు ఖర్చు పెడితే కట్టడం, కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు గ్రామ గ్రామాన ఆ పార్టీని ప్రజలే అడుగుతున్నారు. ఎంతో వ్యతిరేకతను కల్పించినా వీఆర్వోలు గ్రామాల్లో తిరిగి జీపీవోలుగా పని చేస్తూ ప్రజలకు సేవలందిస్తారన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తూ భూ భారతి చట్టాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేయాలన్నారు. ఈ భూమితో చెలగాటం ఆడినోళ్లు, ధరణితో చెలగాటమాడినోళ్లకు ఒకటే గతి పడుతుందన్నారు. ధరణి ముసుగులో దోపిడీ చేయడం వల్లే వారికి ప్రజలే శిక్ష అమలు చేశారన్నారు. సమాజం ముందు దోషులుగా నిలబెట్టేందుకు వారి పేపర్లు, టీవీలను అడ్డం పెట్టుకున్నారన్నారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజల మెదడులో నాటేటట్టు చేశారని తెలిపారు. అందుకే సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. అవినీతి ముద్రను తొలగించాలని జీపీవోలకు పిలుపునిచ్చారు. ధరణి ముసుగులో చేసిన దోపిడీని ప్రజలకు వివరించాలన్నారు. రెవెన్యూ శాఖ మీద పడిన చెడు ముద్ర పోయేటట్లుగా గ్రామాల్లో పని చేయాలన్నారు. మీ మీద పడిన మచ్చను తొలగించుకోవాలని, ఆ మేరకు నిరూపించుకోవాలని జీపీవోలను సూచించారు.

గ్రామ సుప‌రిపాల‌న‌ను తెచ్చాం: మంత్రి పొంగులేటి
ఎన్నిక‌ల స‌మయంలో ఇచ్చిన హామీ మేర‌కు రాష్ట్రంలో ఇందిర‌మ్మ రాజ్యం ఏర్పడిన వెంట‌నే గ్రామ సుప‌రిపాల‌న‌పై దృష్టి సారించి గ్రామాధికారుల నియామ‌కానికి శ్రీ‌కారం చుట్టామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గ‌త ప్రభుత్వం 2020 ఆర్వోఆర్ చ‌ట్టం, ధ‌ర‌ణి పోర్టల్ వల్ల తెలంగాణ స‌మాజం తీవ్రంగా న‌ష్టపోయింద‌ని మంత్రి అన్నారు. అందువ‌ల్లే ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ధ‌ర‌ణిని బంగాళాఖాతంలో క‌లిపేసి భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చామ‌ని, దీని రూప‌క‌ల్పన స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డిని సుమారు 36-37 గంట‌ల‌కు పైగా ప‌లుమార్లు విసిగించి ఆయ‌న స‌ల‌హాల‌తో మ‌రీ తీసుకువ‌చ్చామ‌ని వివ‌రించారు. భూ భార‌తిని తొలుత 4 మండ‌లాల్లోని 4 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకువ‌చ్చామ‌ని త‌ర్వాత 32 మండ‌లాల్లోనూ, జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ‌ల‌కు అందించామ‌ని వివ‌రించారు. ఎవ‌రి నుంచి ఒక్క రూపాయికూడా తీసుకోకుండా 8.65 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు తీసుకున్నామ‌ని తెలిపారు. గ‌త ప్రభుత్వంలో సాదాబైనామాల‌పై సుమారు 9.26 ల‌క్షల ద‌ర‌ఖాస్తుల‌కు మోక్షం క‌ల‌గ‌లేద‌ని, పైగా కోర్టుల‌లో కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. తాజాగా నిర్వహించిన స‌ద‌స్సుల‌లో సుమారు 8.65 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌న్నారు. వారం రోజుల క్రితం కోర్టులో సాదాబైనామాల‌పై స్టేను తొలగించేలా ప్రయ‌త్నించి స‌ఫ‌ల మ‌య్యామ‌ని తెలిపారు. గతంలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు, ప్రస్తుత తాజా ద‌ర‌ఖాస్తుల‌న్నింటినీ సాధ్యమైనంత త్వరగా ప‌రిష్కరిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 6860 క్లస్టర్‌ల‌ను ఏర్పాటు చేసి 10,954 రెవెన్యూ గ్రామాల‌లో గ్రామ‌ప‌రిపాల‌నాధికారుల నియామ‌కం చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు. స‌ర్వేయ‌ర్ల నియామ‌కం ద్వారా భూ స‌మస్యల‌కు చెక్ పెడ‌తామ‌న్నారు. 318 మంది స‌ర్వేయ‌ర్లుకు అద‌నంగా 800 మందిని నియమించ‌డ‌మే గాక 7000 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లను వ‌చ్చే ఉగాదిలోగా భ‌ర్తీ చేస్తామ‌ని ప్రక‌టించారు. సుమారు 3 ద‌శాబ్దాలుగా వివిధ ప్రాజెక్ట్ ల‌కు జ‌రిగిన భూ సేక‌ర‌ణలో ఇంకా రైతుల పేర్లు పహనీల్లో ఉండిపోయాయ‌ని, ఈ స‌మ‌స్యను కూడా ప‌రిష్కరిస్తామ‌న్నారు. ప్రతి సంవ‌త్సరం డిసెంబ‌ర్ 31వ తేదీనాటికి అన్ని గ్రామాల వారీగా జ‌మాబందీ మేర‌కు అప్పటి వ‌ర‌కు జ‌రిగిన క్రయవిక్రయాల‌ను హ‌క్కుల‌ను వివ‌రించేలా ప్రక‌ట‌న జారీ చేస్తామ‌న్నారు. దీని హార్డ్‌ కాపీలు ప్రతి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ఇక‌పై ప్రభుత్వానికి మాట‌, మ‌చ్చ రాకుండా ప‌నిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ కుటుంబ స‌భ్యుల‌దేన‌ని చెబుతూ ఉన్నత సేవ‌లు అందిస్తామంటూ మంత్రి ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. తనతో పాటు మీరు, మీతో పాటు నేను ప్రజ‌ల‌కు మరిన్ని మంచి సేవ‌లు అందిద్దామ‌న్నారు. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా భూ భారతి చట్టం తయారు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధరణి స్థానంలో అద్భుతమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ఈ చట్టం చేసే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడిపారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ధరణి చట్టానికి విధివిధానాలు రూపొందించలేదని కానీ మేమొచ్చాక పేదవాడి భూములకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధరణి ద్వారా ఏర్పడిన సమస్యలను గత ప్రభుత్వం పరిష్కరించలేదని మా ప్రభుత్వంలో అధికారులే ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. చెప్పిన మాట వినలేదని గత ప్రభుత్వాధినేత గ్రామ రెవెన్యూ వ్యవస్థను రోడ్డున పడేసిందని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రిలు సీతక్క, సీసీఎల్ఏ లోకేష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad