క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మెదక్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ఆసక్తికర ట్వీట్ పెట్టారు.
‘సంధ్య థియేటర్ తొక్కిసలాట మరియు మెదక్ ప్రమాదం.. ఈ రెండు సంఘటనల్లో వేర్వేరు న్యాయాలు ఉండకూడదు. రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఇద్దరూ ప్రమఖులే. ఒకరు సినీ స్టార్ AA.. మరొకరు సీఎం RR. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డగి బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చిన కారణంగా రేవతి సంధ్య థియేటర్‌కు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. మరోచోట సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని బహిరంగ ప్రదేశంలో పర్మిషన్ లేకున్నా.. ఇద్దరు యువకులు ఫ్లెక్సీ కడుతూ ప్రమాదవశాత్తు చనిపోయారు.
ఈ రెండు ఘటనల్లో వ్యక్తులను చంపాలన్న ఉద్దేశం ఇటు రేవంత్ రెడ్డి, అటు అల్లు అర్జున్‌కు లేదు. కేవలం జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా జరిగిన మరణాలు.. ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యలు కాదు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను ఎలాగైతే నిందితుడిగా చేర్చారో.. మెదక్ ఘటనలో రేవంత్ రెడ్డిని చేర్చాలి. అంతేకాదు.. పోలీసులు కూడా బాధ్యులు అవుతారు. వాళ్ల పాత్ర ఎంతనేది తరువాత ఇన్వెస్టిగేషన్‌లో తేలుతుంది. అల్లు అర్జున్ మీద ఎలాగైతే కేసు పెట్టారో.. రేవంత్ రెడ్డి మీద కూడా అలాగే కేసు పెట్టాలి డీజీపీ గారు’ అని RSP డిమాండ్ చేశారు.