Samagra Shiksha project expansion : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం 8వ తరగతి వరకే అందుతున్న ఉచిత యూనిఫాం, పుస్తకాలు, రవాణా భత్యం వంటి ప్రయోజనాలు ఇకపై ఇంటర్మీడియట్ వరకు విస్తరించనున్నాయా..? ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఓ కీలక ప్రతిపాదనను పంపాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న “సమగ్ర శిక్ష 3.0″లో ఈ మార్పులను చేర్చాలని కోరుతున్నాయి. అసలు ఈ ప్రతిపాదన ఎందుకొచ్చింది? దీనివల్ల విద్యార్థులకు కలిగే పూర్తి ప్రయోజనాలేంటి..? కేంద్రం నిధుల కేటాయింపుపై రాష్ట్రాల అసంతృప్తికి కారణమేంటి..?
పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “సమగ్ర శిక్ష” పథకం పరిధిని ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు పెంచాలని అన్ని రాష్ట్రాలు ముక్తకంఠంతో కేంద్రాన్ని కోరాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు పేరులో ఇంటర్ వరకు అని ఉన్నప్పటికీ, నిధుల కేటాయింపులో మాత్రం కేంద్రం 8వ తరగతికే పరిమితం చేస్తోంది. ప్రస్తుత “సమగ్ర శిక్ష 2.0” వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నేపథ్యంలో, “సమగ్ర శిక్ష 3.0” విధివిధానాల రూపకల్పనపై కేంద్ర విద్యాశాఖ ఈనెల 7న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో, రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై కేంద్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న అరకొర నిధులతో విద్యారంగంలో ఆశించిన వేగంతో పురోగతి సాధించలేమని, పథకం విస్తృతిని, నిధులను గణనీయంగా పెంచాలని రాష్ట్రాల అధికారులు బలంగా వాదించినట్లు తెలిసింది.
“బిహార్ రాజధాని పట్నాలో మౌలిక వసతుల కోసం కేంద్రం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. అస్సాంలో ఒక్క వంతెనకే రూ.16 వేల కోట్లు కేటాయించారు. కానీ, దేశంలోని అన్ని రాష్ట్రాల పాఠశాల విద్య కోసం సమగ్ర శిక్ష కింద ఈ ఏడాది కేటాయించింది కేవలం రూ.41,250 కోట్లే. ఇంత తక్కువ నిధులతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు ఎలా తీసుకురాగలం?” అని ఓ ఉన్నతాధికారి సమావేశంలో ప్రశ్నించినట్లు సమాచారం.
రాష్ట్రాల ప్రతిపాదనలు ఇవే: ఉచిత యూనిఫాం, పుస్తకాలు: ప్రస్తుతం 8వ తరగతి వరకే అందిస్తున్న ఈ సౌకర్యాన్ని 12వ తరగతి వరకు పొడిగించాలి. అంతేకాకుండా, పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) విద్యార్థులకు కూడా వర్తింపజేయాలి. ఒక్కో జత యూనిఫాంకు ప్రస్తుతం ఇస్తున్న రూ.600-800ను, నాణ్యతను బట్టి రూ.1,200-2,000కు పెంచాలి.
రవాణా ఛార్జీలు: సమీపంలో పాఠశాలలు లేని విద్యార్థులకు ఏడాదికి (10 నెలలకు) ఇస్తున్న రూ.6,000 రవాణా భత్యాన్ని రూ.10,000కు పెంచి, 12వ తరగతి వరకు అమలు చేయాలి.
స్కూల్ కౌన్సెలర్లు: విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలను నివారించేందుకు ప్రతి 500 మంది విద్యార్థులకు ఒక స్కూల్ కౌన్సెలర్‌ను నియమించాలి. వారికి నెలకు రూ.35,000 గౌరవ వేతనం ఇవ్వాలి.
నిధుల పెంపు: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV) నిర్వహణ నిధులను ఏటా రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచాలి. పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ను గరిష్ఠంగా రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు, క్రీడా గ్రాంట్‌ను రూ.25,000 నుంచి రూ.30,000కు పెంచాలి. ప్రతి పాఠశాలకు క్రీడా టీచర్లను మంజూరు చేయాలి.
తల్లిదండ్రుల సమావేశాలు: ఆరు నెలలకు ఒకసారి తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం (PTM) నిర్వహించేందుకు ప్రతి పాఠశాలకు రూ.10,000 మంజూరు చేయాలి.
ఆధునిక ల్యాబ్‌లు: అటల్ టింకరింగ్ ల్యాబ్ (ATL) తరహాలో అన్ని ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్‌లను ఏర్పాటు చేసి, ప్రత్యేక టీచర్‌ను నియమించాలి.
కెరీర్ గైడెన్స్: ప్రతి జిల్లాలో కెరీర్ గైడెన్స్ సెల్, ప్రభుత్వ డైట్లను ఏర్పాటు చేయాలి. విద్యా సమీక్ష కేంద్రాలను (VSK) మండల, జిల్లా స్థాయిల్లో కూడా నెలకొల్పాలి.


