“పదేళ్ల కింద హుస్నాబాద్ లో పరిస్థితి ఏవిధంగా ఉండేదో చూసాం.. నేడు ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా చూస్తున్నాం… గతంలో సాగునీరు ఉండేది కాదు.. రైతుల ఆత్మహత్యలు ప్రతినిత్యం ఉండేది… కానీ నేడు పరిస్థితి మారిపోయింది.. గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి.. అన్ని రంగాల్లో హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోతోంది… హుస్నాబాద్ ను ఇలాగే కాపాడుకుందాం… ఇక్కడి అభివృద్ధి యజ్ఞం ఆగొద్దు… అభివృద్ధి కొనసాగిద్దాం”.. అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల బీ ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం మీర్జాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న శుభం గార్డెన్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సి ఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామని, సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గడచిన పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని గుర్తు చేసారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ పార్టీ బలంగా ఉందని, ప్రతి సందర్భంలోను దీన్ని రుజువు చేశామని, గులాబీ పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని అయన అన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీకి సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు ఉన్నారని వారిని కాపాడుకుంటామని వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరించాలని, సోషల్ మీడియాను వినియోగించాలని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపను వివరించాలని కోరారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేసింది ఏమి లేదని, కానీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. ప్రజలంతా బీ ఆర్ ఎస్ వైపే ఉన్నారని, హుస్నాబాద్ లో బీ ఆర్ ఎస్ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని కార్యకర్తలు ఇందుకు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
గౌరవెల్లి సిద్ధం
లక్ష ఎకరాలకు సాగునీరు అందించే గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. ఈ ప్రాంత కరువును శాశ్వతంగా గౌరవెల్లి ప్రాజెక్టు దూరం చేస్తుందని, హుస్నాబాద్ ను సస్యశ్యామలం చేస్తుందని, ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టును ప్రస్తావించారని గుర్తు చేసారు. ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసేందుకు సి ఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కృషి చేసారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గౌరవెల్లిని పూర్తి చేశామని, ఈ ప్రాంత రైతులు, ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు కల నిజం కాబోతోందని అయన స్పష్టం చేశారు.