Sunday, November 16, 2025
HomeతెలంగాణMonsoon Woes: వాన దెబ్బ - జ్వరాల దడ.. ఇంటింటా పొంచి ఉన్న ముప్పు!

Monsoon Woes: వాన దెబ్బ – జ్వరాల దడ.. ఇంటింటా పొంచి ఉన్న ముప్పు!

Telangana Monsoon Health Advisory : చిటపట చినుకులు మనసుకు హాయినిస్తున్నా.. మీ ఆరోగ్యానికి మాత్రం ముప్పు తెస్తున్నాయని తెలుసా..? రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడటంతో పాటు, రోగాల కుంపటి కూడా రాజుకుంటోంది. ఇంటింటా జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అసలు ఈ సీజనల్ వ్యాధులు ఎందుకింతగా విజృంభిస్తున్నాయి..? కంటికి కనిపించని శత్రువుల నుంచి మనల్ని మనం, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి..? 

- Advertisement -

కారణం ఇదే.. రోగాల వలయం : కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణమే ప్రస్తుత అనారోగ్యాలకు ప్రధాన కారణం.

తేమతో పెరిగే ముప్పు: గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.

మురికికూపాలుగా పరిసరాలు: వర్షపు నీరు ఖాళీ ప్రదేశాల్లో నిలిచిపోయి దోమలకు నిలయాలుగా, మురికికూపాలుగా మారుతున్నాయి. ఈ అపరిశుభ్రతే రోగాలను ఇళ్లకు ఆహ్వానిస్తోంది.

ఒకరి నుంచి అందరికీ: కుటుంబంలో ఒక్కరికి ఇన్ఫెక్షన్ సోకినా, అది వేగంగా ఇంటిల్లిపాదికీ వ్యాపిస్తోంది. దీంతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆసుపత్రులకు వస్తున్న వారిలో 40 శాతం మంది సీజనల్ వ్యాధి బాధితులే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

విజృంభిస్తున్న వ్యాధులు : ప్రస్తుతం ప్రధానంగా ఈ కింది లక్షణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
సాధారణ జ్వరాలు: జలుబు, దగ్గు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు.
వైరల్ జ్వరాలు: తీవ్రమైన జ్వరం, భరించలేని ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు.
ప్రమాదకర వ్యాధులు: దోమల ద్వారా వ్యాపించే డెంగీ, చికున్‌గన్యా కేసులు పెరుగుతున్నాయి. జ్వరంతో పాటు ప్లేట్‌లెట్లు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

చర్మ సమస్యలు: తేమ వాతావరణం, తడి దుస్తుల వల్ల దురద, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా అధికమయ్యాయి.

వైద్యుల మాట.. మనకు బాట..

“వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతోనే కాలానుగుణ వ్యాధులను దూరం పెట్టగలం. తాజా ఆహారం తినాలి, కాచి చల్లార్చిన నీటినే తాగాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించడం ఉత్తమం. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. విటమిన్‌-సి అధికంగా ఉండే నిమ్మ, నారింజ, ఉసిరి వంటివి తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జ్వరం లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.”

– డా. ఐశ్వర్య, జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి, ఖమ్మం సర్వజనాసుపత్రి


పిల్లలు, వృద్ధులు పదిలం : రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పాఠశాలలకు వెళ్లే పిల్లలు వర్షంలో తడవకుండా చూడాలి. జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. గోరువెచ్చని నీటిని తాగడం, కూరగాయలను శుభ్రంగా కడిగి వాడటం వంటి చిన్నపాటి జాగ్రత్తలతో పెద్ద ముప్పు నుంచి బయటపడవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad