Secunderabad train station changes : మీరు త్వరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం! మీ రైలు మీరు అనుకున్నట్లుగా సికింద్రాబాద్ నుంచి బయలుదేరకపోవచ్చు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా, దక్షిణ మధ్య రైల్వే కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పలు రైళ్ల ప్రారంభ స్టేషన్లను తాత్కాలికంగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఏయే రైళ్ల స్టేషన్లు మారాయి..? ఈ మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి..? ప్రయాణికులుగా మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఏమిటి..?
పనుల వేగం.. రైళ్ల మార్గం మార్పు : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండంతస్తుల భారీ స్కై కాంకోర్స్, కొత్త లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కీలక పనుల కోసం స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌లను దశలవారీగా 115 రోజుల పాటు మూసివేయనున్నారు. దీంతో స్టేషన్‌పై భారాన్ని తగ్గించేందుకు, సుమారు 60కి పైగా రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్ల నుంచి నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
అక్టోబరు 20 నుంచి మార్పులు : దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం, అక్టోబరు 20 నుంచి 26వ తేదీ వరకు ఈ కింద పేర్కొన్న రైళ్లు సికింద్రాబాద్‌కు బదులుగా కొత్త స్టేషన్ల నుంచి బయలుదేరుతాయి.
సికింద్రాబాద్ – పోర్‌బందర్ సర్వీసు: ఉందానగర్ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది.
సిద్దిపేట – సికింద్రాబాద్ రైలు: మల్కాజిగిరి స్టేషన్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తుంది.
పుణే – సికింద్రాబాద్ సర్వీసు: హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
చర్లపల్లికి మారనున్న రైళ్లు : రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన సింహభాగం రైళ్లను నూతనంగా అభివృద్ధి చేసిన చర్లపల్లి టెర్మినల్‌కు మార్చనున్నారు. వీటిలో కొన్ని ముఖ్యమైన రైళ్లు..
సికింద్రాబాద్ – మణుగూరు
సికింద్రాబాద్ – రేపల్లె
సికింద్రాబాద్ – సిల్చార్
సికింద్రాబాద్ – దర్భంగా
సికింద్రాబాద్ – యశ్వంత్‌పూర్
సికింద్రాబాద్ – అగర్తాల
సికింద్రాబాద్ – ముజఫర్‌పూర్
సికింద్రాబాద్ – దానాపూర్
సికింద్రాబాద్ – రామేశ్వరం
హైదరాబాద్ – రాక్సల్ సర్వీస్
సికింద్రాబాద్ – సంత్రగచ్చి
ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందుగా తమ రైలు బయలుదేరే స్టేషన్ వివరాలను ఎన్‌టీఈఎస్ (NTES) యాప్ లేదా రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మార్పుల వల్ల కలిగే తాత్కాలిక అసౌకర్యానికి ప్రయాణికులు సహకరించాలని కోరారు.


