Friday, November 22, 2024
HomeతెలంగాణSeethakka: ప్రతి ఇంటికీ నల్లా నీరు

Seethakka: ప్రతి ఇంటికీ నల్లా నీరు

గుడ్ న్యూస్..

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రతీ ఒక్కరికి స్వచ్ఛమైన,శుద్ధిచేసిన తాగునీటిని అందించడం మిషన్ భగీరథ ఇంజినీర్ల బాధ్యత అని , ప్రతి రోజూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తాగు నీటి సరఫరాను అందించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.

- Advertisement -

పైపు లైను పగిలినా..

మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయంలో శనివారం మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని తాగునీటి సరఫరాపై , రాబోయే వేసవి సన్నద్ధతపై పూర్తి స్థాయి సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ .. పైపు లైనులు లీకైనా, పగిలినా వెంటనే వాటిని సరిదిద్ది నీటి సరఫరాను 24 గంటలలో పునరిద్దరించాలన్నారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, అతిసారం కేసుల విషయంలో అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు. గ్రామాలలోని ఓవర్ హెడ్ టాంకులలో ప్రతీరోజూ క్లోరినేషన్ చేయాలని , ప్రతి 10 రోజులకు ఒకసారి టాంకులను శుభ్ర పరచాలని, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ప్రత్యామ్నాయాలపై జాగ్రత్త..

తెలంగాణ ప్రభుత్వం సకాలంలో అన్ని చర్యలు తీసుకోవడం వలన గత వేసవిలో ఏ విధమైన మంచి నీటి ఎద్దడి కలుగలేదని తెలిపారు. రాబోయే వేసవి కోసం కూడా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రచించి, తదనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రిజర్వాయర్లు-నదుల వంటి తాగునీటి వనరుల నీటి మట్టం స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. చేతి పంపులు, సింగిల్ ఫేజ్ పంపులు , త్రీ ఫేజ్ పంపుల మరమ్మతులు చేసి ఫంక్షనల్ స్టేజ్‌కి తీసుకురావాలని ఆదేశించారు. మిషన్ భగీరధ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు, ప్రత్యామ్నాయంగా పై స్థానిక వనరుల నీటి నాణ్యతను పరీక్షించిన తరువాతే , ఆ నీటిని ఇంటింటికి సరఫరా చేయాలన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటి సరఫరా చేయాలి. గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి రాబోయే వేసవిలో మంచి నీటి ఎద్దడి కలుగకుండా జాగ్రత్త వహించాలని మంత్రి ఆదేశించారు. వార్తా పత్రికలలో, సోషల్ మీడియాలో తాగు నీటి సరఫరాకు సంబంధించిన వచ్చిన వార్తలపై, పిర్యాదుల పట్ల వెంటనే స్పందించి పరిష్కరించాలని ఇంజినీర్లను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా కార్యదర్శి లోకేశ్ కుమార్, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కృపాకర్‌ రెడ్డితోపాటు ఇతర మిషన్‌ భగీరథ చీఫ్‌ ఇంజినీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News