యువతr యువకులు రాజకీయాలలోకి రావాలని, దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే దళసరి సీతక్క అన్నారు. యువజన కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం యువజన జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జనాభాలో అధిక శాతం యువత ఉందని, యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రానున్న రోజులలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ నాయకులు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు యువతకు అనేక మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. గృహలక్ష్మి పథకంలో లబ్ధిపొందడానికి గడువు పొడిగించాలని సీతక్క డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రవి చందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుపైడాకుల అశోక్, మండల పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.