షాద్ నగర్ అసెంబ్లీ బరిలో ఓ నవ యువకుడికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. ప్రవీణ్ కుమార్ అవకాశం కల్పించారు. నియోజకవర్గంలోని లక్ష్మీ దేవునిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి యువ నాయకుడు పసుపుల ప్రశాంత్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. విద్యార్థి నాయకుడిగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ మొదట సిపిఎం పార్టీలో కొంతకాలం పనిచేశారు. సిపిఎం అనుబంధ సంఘమైన ఎస్ఎఫ్ఐ విభాగంలో ఫుల్ టైం వర్కర్ గా పనిచేశారు. కమ్యూనిస్టు ఉద్యమాలలో ప్రశాంత్ బాగా ఆరితేరాడు. అయితే గత కొంతకాలం క్రితం ప్రశాంత్ సిపిఎం పార్టీకి రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీలో చేరారు. బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. ప్రవీణ్ కుమార్ రాక తర్వాత ఆయన ఆశయాలకు మెచ్చి పార్టీలో చేరారు. లక్ష్మీదేవుని పల్లి గ్రామంలో ఓ వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టిన ప్రశాంత్ డిగ్రీ వరకు చదివారు. తల్లిదండ్రులు పసుపుల మల్లయ్య, స్వరూప దంపతులకు మొదటి సంతానం ప్రశాంత్.
షాద్ నగర్ రాజకీయాలలో కొత్త ఒరవడి సృష్టిస్తా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు బహుజన రాజ్యం రావడమే తమ పార్టీ లక్ష్యమని, తనకు అసెంబ్లీ బరిలో మొట్ట మొదటిసారి అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని యువ నాయకుడు ప్రశాంత్ తెలిపారు. ఎన్నికల్లో బూర్జువా పార్టీలను మట్టి కరిపించడమే తన లక్ష్యమని అన్నారు. ముదిరాజులకు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయని బహుజన సమాజ్ పార్టీ ముదిరాజులను అక్కున చేర్చుకుందని అన్నారు. ముదిరాజులను పాలక పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా చిన్నచూపు చూశాయని కానీ ఆర్ ప్రవీణ్ కుమార్ ఎంతో నమ్మకంతో షాద్ నగర్ స్థానాన్ని ముదిరాజుల సంక్షేమం కోసం తమకు రాజకీయంగా గొప్ప విలువ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. షాద్ నగర్ అసెంబ్లీ పరిధిలో తనను గెలిపిస్తే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును సాధించే దిశగా కృషి చేస్తానని ఇంకా ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానని సమస్యల పరిష్కారాన్ని సత్వరంగా కనుక్కుంటానని అన్నారు.
ప్రజా సమస్యలు తీరాలంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలంటే బీఎస్పీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రశాంత్ తెలిపారు..