Gandhi Bhavan Protests: హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ యాదవ సంఘాలకు చెందిన కొందరు గాంధీ భవన్‌లోకి గొర్రెలను తీసుకెళ్లి వినూత్నంగా నిరసన చేపట్టారు. గొర్రెల పంపిణీ చేయడంతో పాటు యాదవులకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం నెలకొంది. అనంతరం గాంధీ భవన్ వెలుపల గొల్ల కురుమల సంక్షేమ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “సన్నాలకు బోనస్ బంద్.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్.. గ్యాస్ బండకు రాయితీ బంద్.. రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్.. బీఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్” అని విమర్శించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించారని.. మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలు గాలికి వదిలేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని ధ్వజమెత్తారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిందన్నారు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయ హస్తం మేనిఫెస్టోలో ఊదరగొట్టారని గుర్తుచేశారు. మీ మాటలు విని విని విసిగి పోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్ కు గొర్రెలు తోలుకొని వచ్చి నిరసన తెలియచేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మోసాలను గుర్తిస్తున్న అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తకముందే కళ్ళు తెరవాలని సూచించారు. చెప్పిన గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు.
Gandhi Bhavan: గాంధీ భవన్‌లో గొర్రెలతో వినూత్న నిరసన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


