Foreign Job Fraud: కన్నవారిని, కట్టుకున్న భార్యను, పసిపిల్లలను వదిలి కడలి దాటితే నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చన్న ఆశ. కుటుంబానికి బంగారు భవిష్యత్తును అందించాలన్న తపన. కానీ, ఆ ఆశనే పెట్టుబడిగా పెట్టి మోసపోయాడు. రష్యాలో రాజాలా బతకొచ్చని నమ్మిస్తే, కిర్గిజ్‌స్థాన్‌లో కనీసం వైద్యం కూడా అందని బానిసగా మార్చేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడి జీవితంలో జరిగిన కన్నీటి గాథ ఇది. ఆ యువకుడి ఆర్తనాదం ఏంటి..?
అప్పు చేసి.. ఆశతో.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతాపూర్‌కు చెందిన సౌడు రజనీకాంత్, జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ఇద్దరు చిన్న కుమారులతో ఉన్న అతడు, కుటుంబానికి మరింత మెరుగైన జీవితాన్ని అందించాలనే ఆశతో విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం, గతంలో తనను మలేసియా పంపిన రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లికి చెందిన ఏజెంట్లు, తండ్రీకొడుకులైన మహబూబ్, అన్వర్‌లను సంప్రదించాడు. వారు రష్యాలో సెంట్రింగ్ పనికి మంచి గిరాకీ ఉందని, భారీగా సంపాదించవచ్చని ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన రజనీకాంత్, అప్పు చేసి మరీ రూ.2.10 లక్షలను వారికి ముట్టజెప్పాడు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/mahabubnagar-dry-port-gudibanda-proposal/
ఆరోగ్యం బాగోలేదన్నా.. వదల్లేదు : విధి ఆడిన వింత నాటకంలో, జులై మొదటి వారంలో బోరు బావి వద్ద పనిచేస్తుండగా రజనీకాంత్ దవడకు తీవ్ర గాయమై రెండు ఎముకలు విరిగాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఏజెంట్ల నుంచి ఫోన్ వచ్చింది. రష్యాకు వీసా, టికెట్లు సిద్ధమయ్యాయని, వెంటనే బయలుదేరాలని ఒత్తిడి చేశారు. నా దవడకు ఆపరేషన్ అయింది, కుట్లు విప్పలేదు, నేను రాలేనని బాధితుడు రజనీకాంత్ ఎంత వేడుకున్నా వారు వినలేదు. “తగ్గాక వెళ్తాను” అని ప్రాధేయపడినా, “ఇప్పుడు వెళ్లకపోతే డబ్బులు తిరిగిరావు” అని బెదిరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో, కన్నీళ్లతోనే ప్రయాణానికి సిద్ధమయ్యాడు.
రష్యా అని చెప్పి.. నరకానికి పంపి : రష్యాకు విమానం అని చెప్పిన ఏజెంట్లు, జులై 15న ముంబయి మీదుగా అతడిని కిర్గిజ్‌స్థాన్‌కు పంపారు. అక్కడకు వెళ్లాక గానీ అసలు మోసం తెలియలేదు. సెంట్రింగ్ పని అని చెప్పి, సిమెంట్ బస్తాలు, స్టీల్ రాడ్లు మోసే కఠినమైన పనిలో పెట్టారు. వెళ్లిన వెంటనే అతని పాస్‌పోర్టు, వీసా లాక్కున్నారు. బరువైన పనులు చేయడంతో, వెళ్లిన మూడో రోజుకే దవడ కుట్ల నుంచి రక్తస్రావం మొదలైంది. తీవ్రమైన వాపు, ఇన్ఫెక్షన్‌తో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/tgrtc-ticket-price-30-percent-hiked/
కాపాడండి సారూ.. కన్నీటి రోదన : తనను ఇండియా పంపించాలని యాజమాన్యాన్ని వేడుకుంటే, వారు పట్టించుకోకపోగా కంపెనీ ఆవరణలోనే బంధించారు. పస్తులు పెడుతూ నరకం చూపిస్తున్నారని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వాపోయాడు. దీంతో హతాశులైన కుటుంబ సభ్యులు మెదక్ ఎంపీ రఘునందన్‌రావును ఆశ్రయించారు. ఆయన ఈ విషయంపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. విషయం తెలుసుకున్న కిర్గిజ్‌స్థాన్‌లోని కంపెనీ ప్రతినిధులు, రూ.70 వేలు చెల్లిస్తేనే పాస్‌పోర్టు ఇచ్చి పంపిస్తామని కొత్త మెలిక పెట్టారు. “మా దగ్గర చిల్లిగవ్వ లేదు, ప్రభుత్వమే మా బిడ్డను కాపాడాలి” అని రజనీకాంత్ తల్లి వరవ్వ, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ధ్రువీకరించుకోకుండా డబ్బులు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


