అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలతో నవనాధుల సిద్ధుల గుట్టపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అంబరాన్ని తాకిన శ్రీసీతారామ కల్యాణ మహోత్సాహంతో సిద్ధులగుట్ట శోభాయమానంగా విరాజిల్లింది. “రమణీయం, కమనీయం, రాములోరి కల్యాణం” అని మురిసిపోతూ భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. ఈ కల్యాణ మహాత్సావాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు .
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించారు. సిద్ధులగుట్ట రామ నామ స్మరణతో మారు మ్రోగింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య కమనీయంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తజనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
సిద్ధులగుట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణానికి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆయన సతీమణి రజితా రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పంపించిన పట్టు వస్త్రాలను కూడా జీవన్ రెడ్డి ఆలయ పూజారులకు అందజేశారు.ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల స్వామి వారికి కవిత పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
కాగా జీవన్ రెడ్డి దంపతులు రాములోరి కళ్యాణం అనంతరం శివాలయంలో పూజలు నిర్వహించి అన్నదాన వితరణ చేశారు.